రాష్ట్రాన్ని గులాబీ పురుగు తొలిచేస్తోంది..

31 Aug, 2018 19:53 IST|Sakshi
మల్లు భట్టి విజరమార్క

సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రాన్ని గులాబీ పురుగు తొలిచేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ముదిగొండ మండలంలోని మేడేపల్లిలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పత్తి పంటను బయటకు కనపడకుండా గులాబీ పురుగు తొలిచేసినట్టు రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ గులాబీ పురుగులు తొలిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులను, ఇతర నిధులను గులాబీ నేతలు తొలిచేశారని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల, ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం అయిన ఇచ్చారా అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఆరోగ్య శ్రీ కార్డు అయిన ఇచ్చిందా అని అడిగారు. అభయ హస్తం పెన్షన్‌, పావలా వడ్డికి రుణాలు ఎత్తేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ కార్డుతోపాటు వడ్డీలేని రుణాలు, ఉద్యోగాల కల్పన చేస్తామని అన్నారు. రైతులు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. అంతేకాక పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఒక రూమ్ కట్టించుకున్న పేదలకు అదనంగా మరో గది కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

మరిన్ని వార్తలు