కేసీఆర్‌ను గద్దె దించేందుకే.. కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి

6 Nov, 2017 09:29 IST|Sakshi

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

చౌటుప్పల్‌ (మునుగోడు) : కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. మండల కేంద్రంలోని రాజీవ్‌స్మారక భవనంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ఇప్పుడే ప్రారంభమాయ్యిందన్నారు. ప్రజాసామ్య పరిరక్షకులు, ప్రజసామ్య భక్షకులు అనే రెండు వర్గాలుగా సమాజం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని.. ఈ విషయాన్ని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడి, రాష్ట్రంలోని సీఎం కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

పెద్దనోట్లు రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 8న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ నెల 20న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాహూల్‌గాంధీ హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పాల్వాయి స్రవంతిరెడ్డి, ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పున్న కైలాస్, కుంభం క్రిష్ణారెడ్డి, పాశం సంజయ్‌బాబు, చింతల వెంకట్‌రెడ్డి, గుండు మల్లయ్య, చిక్క నర్సింహ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు