ముఖేశ్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు

31 Jul, 2019 02:31 IST|Sakshi

గాంధీభవన్‌లో పార్థివదేహానికి కాంగ్రెస్‌ శ్రేణుల నివాళి        

ప్రభుత్వ లాంఛనాలతో రాయదుర్గం గౌడ్స్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ కన్నీటి వీడ్కోలు పలికింది. మంగళవా రం మధ్యాహ్నం గాంధీభవన్‌కు ఆయన పార్థివ దేహాన్ని తీసుకువచ్చి పార్టీ జెండా కప్పి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ డిప్యూటీ æసీఎం దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నేతలు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, వి.హన్మంతరావు, కూన శ్రీశైలంగౌడ్, అనిల్, వినోద్‌రెడ్డి, బొల్లు కిషన్, ఇందిరాశోభన్, కుమార్‌రావు తదితరులు ఆయనకు నివాళుర్పించినవారిలో ఉన్నారు. అనంతరం ముఖేశ్‌ పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనం లో రాయదుర్గం గౌడ్స్‌ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.  

అండగా సిటీ నేతలు 
ముఖేశ్‌గౌడ్‌ మరణవార్త విన్న దగ్గర నుంచి పార్టీలకతీతంగా నగర నేతలు ఆయన కుటుంబాన్ని వెన్నం టే ఉన్నారు. బంజారాహిల్స్, జాంబాగ్‌లోని ఆయన నివాసాల వద్ద మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నీ తానై నడిపించారు. గాంధీభవన్‌ నుంచి ప్రత్యేక వాహనంలోకి ముఖేశ్‌ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న సమయంలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తనయుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాడె మోశారు. ముఖేశ్‌ తనయుడు, టీపీసీసీ కార్యదర్శి విక్రమ్‌గౌడ్‌కు తోడుగా పెద్దఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు, ముఖేశ్‌ అభిమానులు తరలిరాగా జనసందోహం మధ్య గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర సాగింది.  

చితికి నిప్పంటించిన విక్రమ్‌గౌడ్‌ 
ముఖేశ్‌గౌడ్‌ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య రాయదుర్గం గౌడ్స్‌ శ్మశానవాటికలో నిర్వహించారు. ముఖేశ్‌గౌడ్‌ చితికి కుమారుడు విక్రమ్‌గౌడ్‌ నిప్పంటించారు. రాయదుర్గంకే చెందిన ముఖేశ్‌గౌడ్‌ నగరంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నప్పటికీ తన సొంతూరుతో ఉన్న అనుబంధంతో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,  సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీలు టి.దేవేందర్‌గౌడ్, వి.çహన్మంతరావు, మధుయాస్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్,  మాజీ మంత్రులు గీతారెడ్డి, సీనియర్‌ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంతోష్‌ కుమార్, పలువురు కార్పొరేటర్లు తదితర నేతలు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ అండగా ఉంటుంది: ఉత్తమ్‌ 
తమతో కలిసి సుదీర్ఘ కాలం పనిచేసిన పార్టీ సభ్యుడు మరణించడం తీవ్రబాధ కలిగించిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ అన్నారు. ముఖేశ్‌గౌడ్‌ కుటుంబానికి కాంగ్రెస్‌  ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ముఖేశ్‌ చొరవతోనే వరంగల్‌లో బీసీ గర్జన  జరిగిందని, తన సహచరుడి మృతి కలచివేసిందని పొన్నాల అన్నారు.

>
మరిన్ని వార్తలు