ముఖేశ్‌ గౌడ్‌ కన్నుమూత 

30 Jul, 2019 01:08 IST|Sakshi

కేన్సర్‌తో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస 

ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఆసుపత్రికి తరలింపు 

వైఎస్‌ హయాంలో బీసీ మంత్రిగా సేవలు 

మజ్లిస్‌ కోటలో కాంగ్రెస్‌ను ముందుండి నడిపించిన నేత 

సంతాపం తెలిపిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు 

నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌ : కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎం.ముఖేశ్‌ గౌడ్‌ (60) సోమ వారం మధ్యాహ్నం కన్నుమూశారు. కేన్సర్‌తో చికిత్స పొందుతున్న ఆయనను ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చేర్చి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ.. ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఒకవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతుండగానే.. మరో వైపు ముఖేశ్‌ గౌడ్‌ కన్నుమూశారనే వార్త పార్టీలో విషాదం నింపింది. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్‌ నేతలను పార్టీ కోల్పోయినట్లయింది. గత కొంతకాలంగా కేన్సర్‌తో  బాధపడుతన్న ముఖేశ్‌ గౌడ్‌ ఆరోగ్యం.. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మరింత క్షిణించింది. దీంతో అప్పటినుంచి అపోలో ఆస్పత్రి వైద్యుల సంరక్షణలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయనకు 7 శస్త్రచికిత్సలు జరిగాయి. చివరకు చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో ఆయన మృతి చెందారు. ముఖేశ్‌ గౌడ్‌ 1959 జూలై ఒకటిన జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు విక్రమ్‌ గౌడ్, విశాల్‌ గౌడ్, కుమార్తె శిల్పా ఉన్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖేశ్‌ కన్నుమూసినట్టు సమాచారం తెలియగానే కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు.. హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం ముఖేశ్‌ మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–10లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీలోని స్వగృహానికి తరలించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని నివాళురు అర్పించారు. 
 
నేడు అధికారికంగా అంత్యక్రియలు 
ముఖేశ్‌ గౌడ్‌ భౌతికకాయానికి మంగళవారం ఉదయం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని నగరంలోని జాంబాగ్‌ మార్కెట్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం అంతిమ యాత్ర బయల్దేరుతుంది. ఫిల్మ్‌నగర్‌లో జేఆర్‌సీ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని గౌడ్‌ శ్మశాన వాటిలో మంగళవారం ఉదయం 10.30గంటలకు ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.  
 
మాస్‌లీడర్‌ ముఖేశ్‌ గౌడ్‌ 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ముఖేశ్‌ గౌడ్‌ మాస్‌లీడర్‌గా గుర్తింపు పొందారు. జన హృదయాలను గెలిచిన ప్రజానాయకుడు ముఖేశ్‌.. నగరంలో వేళ్ళ మీద లెక్కించ దగ్గ కాంగ్రెస్‌ నాయకుల్లో ఆయన ఒకరు. యూత్‌ కాంగ్రెస్‌ నేతగా రాజకీయ అరంగ్రేటం చేసి కార్పొరేటర్‌గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
 
కార్పొరేటర్‌ నుంచి.. 
ముఖేశ్‌ గౌడ్‌ 3దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో తన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చారు. ఆది నుంచి కాంగ్రెస్‌ భావజాలానికి ఆకర్షితులైన ఆయన విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. యువజన కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించారు. 1986లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన జాంబాగ్‌ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 1989లో మహారాజ్‌గంజ్‌ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మజ్లిస్‌ కంచుకోట అయిన ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని ముందుండి నడిపి మాస్‌లీడర్‌గా గుర్తింపు పొందారు. అయితే.. 1994,1999లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం 2004లో అక్కడినుంచే మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో గోషామహల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో నాటి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేశ్‌ గౌడ్‌ తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. 2009లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా ఐదేళ్ల పూర్తి కాలం పనిచేశారు.హైదరాబాద్‌ ›బ్రదర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందిన ముఖేశ్‌ హైదరాబాద్‌ నగర రాజకీయాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీచేసి, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించకుండానే కన్నుమూశారు. 
  
ముఖేశ్‌ మృతిపై కేసీఆర్, వైఎస్‌ జగన్‌ల సంతాపం
సాక్షి, హైదరాబాద్‌ : మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ మరణంపై సీఎం కేసీఆర్‌  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.  ముఖేశ్‌ గౌడ్‌ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని తెలి యజేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్‌ తెలియజేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖేశ్‌గౌడ్‌ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియాలతోపాటు టీపీసీసీ ముఖ్య నేతలు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు.  

కాంగ్రెస్‌ ప్రముఖుల సంతాపం 
మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియాలతోపాటు టీపీసీసీ ముఖ్య నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు