రెండు గంటల్లోనే రెండు పార్టీలు.. 

9 Nov, 2018 12:52 IST|Sakshi
తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కలీం

 సాక్షి, బోధన్‌(నిజామాబాద్‌): అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో బలసమీకరణకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను తమ పార్టీలో చేర్చుకునే యత్నాలు చేస్తున్నాయి. గ్రామ, మండల, పట్టణ స్థాయి ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కారణాలు చూపి ఈ పార్టీ నుంచి ఆ పార్టీల్లోకి , ఆపార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్‌ కావడం సహజంగా జరుగుతుంది. కానీ ఉదయం వేళ పార్టీ మారి, మధ్యాహ్నం వరకు సొంత పార్టీల్లోనే కొనసాగుతానని చెప్పుకొస్తున్న విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి.


కాంగ్రెస్‌లో చేరుతున్న కలీం 

దీపావళి పండుగ వేళ బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాంగ్రెస్‌ మైనారిటీ సెల్‌ పట్టణ ఉపాధ్యక్షుడు కలీం తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండుకప్పుకుని ఆ పార్టీలో చేరారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మళ్లీ కాంగ్రెస్‌ కార్యాలయంలో ప్రత్యక్షమై, ఆ పార్టీ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో మళ్లీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించారు. రెండు గంటల్లోనే రెండు పార్టీల కండువాలు మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి కాంగ్రెస్‌ మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు కలీంను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా వివరాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ కండువ కప్పుకోవడం అనుహ్యంగాజరిగిపోయిందన్నారు. సొంత పార్టీ నాయకుల సూచనలు మేరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు.  


 

మరిన్ని వార్తలు