కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి

13 Mar, 2019 03:58 IST|Sakshi

కాంగ్రెస్‌కు నేడో.. రేపో రాజీనామా

ఆమెకు మంత్రి పదవి..కుమారుడికి ఎమ్మెల్సీ పదవి!

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయ కురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. తనకు మంత్రి పదవితోపాటు కుమారుడు కార్తీక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నుంచి భరోసా లభించడంతో ఆమె కాంగ్రెస్‌ను వీడనున్నారు. సబిత బుధవారం తన రాజకీయ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. బుధ లేదా గురువారాల్లో కాంగ్రెస్‌కి రాజీనామా చేసే అవకాశముంది. కేసీఆర్‌ సమక్షంలో సబిత, కార్తీక్‌ గులాబీ కండువా వేసుకోనున్నారు. 

ఫలించని బుజ్జగింపులు... 
కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా బుజ్జగించే ప్రయత్నం చేసినా తన ఆలోచనను సబిత మార్చుకోలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత జానారెడ్డి తదితరులు ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి నచ్చజెప్పేందుకు యత్నించినా వెనక్కి తగ్గకపోవడం తో మంగళవారం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని సబిత ఇంటికెళ్లిన రేవంత్‌.. కాంగ్రెస్‌ను వీడాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సబిత ను కోరారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని సాయంత్రం వరకు ప్రచారం జరిగింది.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే సాయంత్రానికి మళ్లీ సీన్‌ మారింది. రేవంత్‌ తనను కలిసిన సమయంలోనే తాను పార్టీని వీడనున్నట్లు ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఉత్తమ్‌ వ్యవహార శైలితోపాటు జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో సబిత, కార్తీక్‌ తీవ్ర కలత చెందినట్లు తెలిసింది. దీంతోపాటు టీఆర్‌ఎస్‌ నుంచి ఆమెకు మంత్రి పదవి, కుమారుడికి రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్, కేటీఆర్, కవితల నుంచి భరోసా లభించడంతో చివరకు పార్టీ మారాలనే నిర్ణయించుకున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని తన అనుచరులు, పార్టీ సీనియర్‌ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన సబిత, కార్తీక్‌రెడ్డిలు ఇదే విషయాన్ని వారికి చెప్పారు.

మరిన్ని వార్తలు