‘అందరూ నిర్దోషులే.. పేలుళ్లు ఎలా?’

16 Apr, 2018 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ సెక్యులర్‌ దేశమని.. అన్ని మతాలను గౌరవించాలన్నారు. గాంధీ కుటుంబం పాలించినప్పుడల్లా దేశం సంతోషంగా ఉందని, లౌకికవాదాన్ని కాపాడింది కాంగ్రెస్‌ మాత్రమే అని ఆయన తెలిపారు.

నగరంలోని మక్కామసీదుకు ప్రపంచంలోనే పేరుందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. నేటి తీర్పుతో పేలుళ్లలో ఎవరున్నారో తెలియకుండా పోయిందన్నారు. ప్రాసిక్యూషన్‌ ఫెయిలయింది కాబట్టే నిందితులు నిర్దోషులుగా ప్రకటించబడ్డారన్నారు. సాక్ష్యాధారాలను నిరూపించడంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. ప్రాసిక్యూషన్‌ విఫలం వెనుక ఎవరున్నారని ఆయన నిలదీశారు. ఎవరూ దోషులు కాకపోతే.. పేలుళ్లు ఎలా జరిగాయని ఆయన ప్రశ్నించారు. బ్లాస్ట్‌ సూత్రధారులకు శిక్షపడాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.  తీర్పు పూర్తిగా పరిశీలించాక స్పందిస్తామని ఆయన వెల్లడించారు. 

11 ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులు ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న న్యాయమూర్తి.. 10 మంది నిదితుల్లో స్వామి అసిమానంద, భరత్‌, దేవెందర్‌ గుప్తా, రాజేందర్‌, లోకేశ్‌ శర్మలను నిర్దోషులుగా పేర్కొన్నారు. మిగిలినవారిపై చార్జిషీటు కొనసాగుతుందని తెలిపారు.  2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో  ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది  చనిపోగా, అనంతరం చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా మరో ఐదుగురు మృతి చెందారు.
 

మరిన్ని వార్తలు