ఎస్మా అంటే కేసీఆర్‌ ఉద్యోగాన్నే ప్రజలు తీసేస్తరు

6 Oct, 2019 04:00 IST|Sakshi

మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ 

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగం నుంచి తీసేస్తామంటే ప్రజలు కేసీఆర్‌కున్న సీఎం ఉద్యోగాన్నే తీసేస్తారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సీఎంకు తగదని హితవు పలికారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వం కూడా ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను అణచివేసి ఉంటే ఉద్యమం నడిచేదా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ యూటర్న్‌ ముఖ్యమంత్రి అని, ఆయన ఉద్యమ సమయంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని, వారి సమస్యలు వెంటనే పరిష్కారించాలని కోరారు. దాదాపు 10 నెలల తర్వాత ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్‌ తన తప్పులు మాఫీ చేయాలని మాత్రమే కోరారని, ఆయన కలసిన ఎజెండా ఒకటైతే బయట మరోటి చెప్పుకుంటున్నారని ఆరోపించారు. తాను ప్రధాని ముందుంచిన 22 డిమాండ్లలో రిజర్వేషన్ల అంశం ఎందుకు లేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు