మెదక్‌లో హస్తం.. నిస్తేజం

13 Oct, 2019 12:05 IST|Sakshi

ఇప్పటికే ‘చేయి’చ్చిన బడా నేతలు

‘రాములమ్మ’ దారిపై పలువురి దృష్టి

మెతుకుసీమలో ఓ వెలుగు వెలిగిన ‘హస్తం’.. నిస్తేజంగా మారింది. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ జిల్లాలో ఉనికిని కోల్పోయింది. ఇప్పటికే బడా నేతలు జంప్‌ కాగా.. ఆ పార్టీలో కొన్నాళ్లుగా స్తబ్ధత రాజ్యమేలుతోంది. తాజాగా కాంగ్రెస్‌ ఎన్నికల క్యాంపెయినింగ్‌ కమిటీ చైర్‌పర్సన్, మెదక్‌ మాజీ ఎంపీ విజయశాంతి.. బీజేపీవైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో మిగిలిన చోటామోటా నాయకులు ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతుండగా.. ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

సాక్షి, మెదక్‌: కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలిచి.. ఇందిరాగాంధీని ఎంపీగా గెలిపించి.. దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఘన చరిత్ర మెదక్‌కు ఉంది. అలాంటి ఈ జిల్లాలో మారిన రాజకీయ పరిణామ క్రమంలో ఆ పార్టీ ప్రాబవం పూర్తిగా కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఆర్‌ఎస్‌ హవాలో ఆ పార్టీ పరిస్థితులు తలకిందులయ్యాయి. క్రమక్రమంగా నేతలు జారిపోవడంతో కోలుకోలేని స్థితికి చేరింది. ప్రధానంగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలుకాగా.. అప్పటి నుంచి పార్టీలో స్తబ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల్లోనూ పార్టీ కోసం పనిచేయాలనే తపన కొరవడడంతో ఈ దుస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. తాజాగా.. కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం మొదలైంది. మెదక్‌ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ ఎన్నికల క్యాంపెయినింగ్‌ కమిటీ చైర్‌పర్సన్, సినీ స్టార్‌  విజయశాంతి బీజేపీలో చేరనున్నట్లు ఇటీవల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అనుచరులు అన్నీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ఒక్కొక్కరుగా వెళ్లిపోవడంతో.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘హస్తం’ హయాంలో మంత్రిగా పనిచేసిన సునీత లక్ష్మారెడ్డి గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మెదక్‌ ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి జిల్లాలో కీరోల్‌ నిర్వరించారు. అనంతర పరిణామ క్రమంలో ఆయన బీజేపీలో చేరారు. జిల్లాలో ఉన్న ఇద్దరు సీనియర్‌ నాయకులు ఇతర పార్టీల్లో చేరడంతో కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనపడింది. 

ఉన్న వారు పట్టించుకోకపోవడంతో.. 
గత ఏడాది అసెంబ్లీ పోరు తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గాలి అనిల్‌ కుమార్‌ బరిలో దిగారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అతను ఒక్కసారి కూడా మెదక్‌ జిల్లాను తొంగి చూసింది లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పట్లోళ్ల ఉపేందర్‌రెడ్డి కూడా ఇప్పటివరకు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇలా పార్టీలో ఉన్న వారు సైతం అందుబాటులో ఉండకపోవడంతో ముఖ్య నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యం కొరవడింది. 
విజయశాంతి అసంతృప్తి.

ఊగిసలాటలో నాయకులు?
మెదక్‌లో ఎంపీగా గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయశాంతి కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నట్లు.. త్వరలో ఆమె బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి చివరి వరకు ప్రయత్నం చేసి విఫలమైన ఓ నాయకుడు, విజయశాంతి ముఖ్య అనుచరుడు ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఇదివరకే శశిధర్‌రెడ్డి బీజేపీలో పాగా వేసిన నేపథ్యంలో తన పరిస్థితి ఏమిటన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు  మిగిలిన విజయశాంతి ముఖ్య అనుచరులు, చోటామోటా నాయకులు సైతం ఊగిసలాటలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్‌ నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఇద్దరు, ముగ్గురు తప్ప ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనకపోవడం ఇందుకు నిదర్శనమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నైరాశ్యంతోపాటు ఆందోళన నెలకొంది. ఏదేమైనా ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి బీజేపీలో చేరుతారా.. జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకుల పరిస్థితి ఏమిటో వేచిచూడాల్సిందే.   

మరిన్ని వార్తలు