ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత

21 Oct, 2019 11:01 IST|Sakshi

కాంగ్రెస్‌ ముఖ్యనేతల హౌస్‌ అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ‘చలో ప్రగతి భవన్‌’  ఉద్రిక్తంగా మారింది. సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, విక్రం గౌడ్‌, రాములు నాయక్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.  

మరోవైపు కాంగ్రెస్‌ నేతలను తెలంగాణవ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లతో, ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి నేతలను పోలీసులు గృహ నిర‍్బంధం చేశారు. మరోవైపు ఎంపీ రేవంత్‌ రెడ్డి నివాసంతో పాటు, ఆయన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇక మల్‌రెడ్డి రంగారెడ్డి నివాసాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టడంతో ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రగతి భవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించి, గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

  • చలో ప్రగతి భవన్‌ ముట్టడికి వచ్చిన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు అరెస్ట్‌
  • ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ  ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్ బాబు హౌస్ అరెస్ట్
  •  దోమలగూడలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • సంగారెడ్డి జిన్నారం (మం) కాంగ్రెస్ నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరగా, వారిని పోలీసులు  మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
  • ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులకు అదుపులోకి తీసుకున్న పోలీసులు

మరిన్ని వార్తలు