కాంగ్రెస్‌ పాదయాత్ర భగ్నం     

28 Aug, 2019 10:07 IST|Sakshi
శంకర్‌పల్లిలో ధర్నా చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, చంద్రశేఖర్‌ తదితరులు

అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు 

ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న ప్రేమ ‘పాలమూరు–రంగారెడ్డి’పై లేదని ఆగ్రహం 

సాక్షి, రంగారెడ్డి: సాగు, తాగునీటి సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. పాత డిజైన్‌ ప్రకారం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించడం, పాలమూరు–ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి జిల్లాకు నీరందించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ పార్టీ జలసాధన మహాపాదయాత్రని మంగళవారం నిర్వహించ తలపెట్టింది. శంకర్‌పల్లి మండలం మహాలింగాపురం (దోబీపేట్‌)లో ప్రారం భం కావాల్సిన ఈ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. ఉదయం నుంచే కాంగ్రెస్‌ నాయ కులు, కార్యకర్తల అరెస్టులు మొదలయ్యాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. శంకర్‌పల్లికి వెళ్లే అన్ని రూట్లలో పోలీసులు వాహనాలను తనిఖీ చేసి నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఆయా పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పెద్ద ఎత్తున నాయకులు, అరెస్టు కావడంతో పాదయాత్ర సభా ప్రాంగణానికి ఒక్కరు కూడా చేరుకోలేదు.

ప్రజలేం పాపం చేశారు? 
జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు లేదని, వారు ఏం పాపం చేశారని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. గాంధేయమార్గంలో పాదయాత్ర చేపట్టాలని సిద్ధమైతే అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు.   ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పరిధి నుంచి జిల్లాను మినహాయించడం చారిత్రక తప్పిదమని, జిల్లా ప్రజల ఉసురు టీఆర్‌ఎస్‌కు తప్పక తాకుందని శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రాన్ని ఉద్దరిస్తారని ప్రజలు ఓటేస్తే తెలంగాణను అప్పుల కుప్పగా మర్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎదురుతిరిగే గొంతులు లేకుండా సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని విమర్శించారు. గతంలో జిల్లాకు గోదావరి జలాల కోసం పోరాడిన నేతలు టీఆర్‌ఎస్‌ పంచన చేరి సర్కారుకు వత్తాసు పలుకుతున్నారని, వారిని జిల్లా ప్రజలు క్షమించబోరన్నారు. రూ.కోట్లు కమీషన్లు కురిపిస్తున్న కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై లేదన్నారు. ఇక్కడి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటేయలేదా? అని ప్రశ్నించారు.

భగ్గుమన్న నాయకులు..  
సాగునీటి సాధన కోసం తాము పాదయాత్రకు శ్రీకారం చుడితే అనుమతుల పేరిట యాత్రను అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్‌ నాయకులు భగ్గుమన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, పీసీసీ కార్యదర్శి  సురేందర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు పాదయాత్ర ప్రారంభ ప్రాంగణానికి బయలుదేరగా.. శంకర్‌పల్లి పోలీసులు నిలువరించారు. తాము రైతుల కోసం పోరాడుతున్నామని నాయకులు వివరించే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా తాము చేపట్టిన పాదయాత్రకు వెళ్లనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయినా పోలీసులు ముందుకు కదలనీయకపోవడంతో మండల కేంద్రంలోని చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై నినదించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

జిల్లా పన్నులతో అక్కడ పనులా..  
జిల్లాకు సాగునీరు ఇచ్చేంతవరకు ప్రతి ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని రైతులకు అందజేయాలని మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్‌ సర్కారును డిమాండ్‌ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర పాలన సాగుతోందని, ఇక్కడి పన్నులతో సమకూరుతున్న ఆదాయాన్ని ఇతర జిల్లాలో ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్రంలోనూ సాగునీటి కోసం పాదయాత్ర చేయాల్సిన దౌర్భాగ్యాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. గోదావరి నికర జలాలను సద్వినియోగం చేసుకునేందుకు వైఎస్సార్‌ చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తయ్యే ముందు నిలిపివేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. 

మరిన్ని వార్తలు