మెదక్‌’ టికెట్‌  కాంగ్రెస్‌దే..

31 Oct, 2018 14:19 IST|Sakshi
మాట్లాడుతున్న జగపతి, బాలకృష్ణ

మెదక్‌జోన్‌: మెదక్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ టికెట్‌ స్థానిక నేతలకు వస్తుందని టీపీసీసీ ప్రధానకార్యదర్శి బట్టి జగపతి, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరి మ్యాడం బాలకృష్ణ స్పష్టం చేశారు. వారు మంగళవారం మెదక్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ఈ మేరకు పార్టీ స్పష్టమైనసంకేతాలు ఇచ్చినట్లు తెలిపారు. మహాకూటమిలో భాగంగా మెదక్‌ స్థానం తెలంగాణ జనసమితికి వస్తోందని అసత్య ప్రచారం సాగుతోందని, కాంగ్రెస్‌ శ్రేణులు ఎవరూ దీనిని నమ్మొద్దని కోరారు. కొంత మంది పనిగట్టుకుని ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. మెదక్‌ స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని స్టార్‌ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి తమకు చెప్పారన్నారు.  

ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పదికి పది కాంగ్రెస్‌ గెలుచుకోవటం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీఆర్‌ఎస్‌  ఇచ్చినహామీల్లో ఏ ఒక్కటీ నేరవేర్చలేదన్నారు. ఎన్‌డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీని  తెరిపించ చేతగాని టీఆర్‌ఎస్‌ను మళ్లీ గద్దెనెక్కిస్తే ఏం ఒరగ బెడుతుందో ప్రజలో అర్థం చేసుకోవాలన్నారు. ఫ్యాక్టరీని తెరిపించక పోవటంతో ఈ ప్రాంత రైతులు, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అందులో ఐదు మంది కార్మికులు గుండాగి చనిపోయారని విమర్శించారు.

అవన్నీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ ప్రాంత రైతులకు ఉపయోగించాల్సిన సింగూరు నీటిని  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు అక్రమంగా  తరలించటంతో  ఈ ప్రాంతంలోని పంటపొలాలన్ని బీళ్లుగా మారాయన్నారు. నీళ్ల మంత్రి హరీశ్‌రావు ఏం మొహంపెట్టుకొని ఓట్లు అడిగేందుకు మెదక్‌ వచ్చాడని వారు మండిపడ్డారు. పద్మాదేవేందర్‌రెడ్డి  మాహాకూటమిని విమర్శించే ముందు గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకున్న విషయాన్ని మర్చిపోకూడదని తెలిపారు.  మెదక్‌ ప్రాంతానికి మంజూరైన మెడికల్‌ కళాశాలను సిద్దిపేటకు తరలించుకపోతే కళ్లప్పగించి చూసిన పద్మాదేవేందర్‌రెడ్డి ఈప్రాంతానికి చేసిన మేలు ఏం లేదన్నారు. జిల్లాలోని అథ్లెటిక్‌ సెంటర్‌ను హైదరాబాద్‌కు తరలించుక పోతుంటే ఏం చేసిందో? చెప్పాలని ప్రశ్నించారు.   కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అఫిజొద్దీన్, కిషన్‌గౌడ్, చందు ఉన్నారు.

మరిన్ని వార్తలు