పుండు మీద కారం చల్లుతున్నారు:  శ్రవణ్‌

2 Feb, 2019 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఘోరంగా విఫలమైయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కూడా సాధించలేకపోయారని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ పథకానికి నిధులు, రైల్వే కోచ్‌, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీని డిమాండ్‌ చేయడంలో టీఆర్‌ఎస్‌ దారుణంగా విఫలమైందని శ్రవణ్‌ వ్యాఖ్యానించారు.

రైతుల ఓట్లును కొనేందుకు ఆరువేల ఇస్తామని చెప్తూ.. పుండు మీద కారం చల్లుతున్నారని శ్రవణ్‌ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి టీఆర్‌ఎస్‌ పార్టీ కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల నోళ్లలో మన్ను కొట్టాయని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేదని, ఆదాయపన్ను స్లాబులు మార్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని శ్రవణ్‌ అన్నారు. 
 

మరిన్ని వార్తలు