ఎన్నికల బరిలో..  హేమాహేమీలు!

24 Oct, 2018 11:16 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల బరిలో ఈసారి కూడా హేమాహేమీలైన నేతలే పోటీ పడనున్నారు. కాంగ్రెస్‌నుంచి ఇంకా అభ్యర్ధిత్వాలు ఖరారు కాకున్నా, సిట్టింగులు అందరికీ టికెట్లు వస్తాయన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. అదే మాదిరిగా, జిల్లాలో సీనియర్లుగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్‌ మరో సీనియర్‌ నాయకుడు ఆర్‌.దామోదర్‌రెడ్డి సైతం టికెట్‌ వస్తుందన్న ఆశతో ఉన్నారు. వీరందరినీ పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు మెజారిటీ నియోజకవర్గాల్లో సీనియర్లే బరిలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా పార్టీల్లోని నేతలు, జిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకులుగా గుర్తింపు ఉన్నవారంతా ఎన్నికల గోదాలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ పోరుహోరాహోరీగా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

జానా .. ఎనిమిదోసారి
ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న కుందూరు జానారెడ్డి ఎనిమిదో విజయంపై దృష్టి సారించారు. ఇప్పటివరకు ఆయన ఏకంగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించారు. 1978 ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆయన జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా.. 1983, 1988 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి గెలిచారు. అనంతరం 1994 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జానా ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009, 2014 నాలుగు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు తొమ్మిది పర్యాయాలు ఎన్నికలో బరిలోకి దిగిన జానారెడ్డి రెండుసార్లు ఓటమి పాలుకాగా, ఏడు పర్యాయాలు విజయం సాధించి ఈ ఎన్నికల్లో (2018) ఎనిమిదో విజయాన్ని సొంతం చేసుకోవడంపై గురిపెట్టారు.

అదే బాటలో... మోత్కుపల్లి, ఆర్డీఆర్‌
టీడీపీ ఆవిర్భావంతో నేరుగా ఎన్నికల రాజకీయాల్లోకి అడుగెపెట్టిన మోత్కుపల్లి నర్సింహులు సైతం ఇప్పటికు ఆయన ఆరు పర్యాయాలు విజయం సాధించి, ఏడో విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. 1983, 1985 ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించిన మోత్కుపల్లి, 1989లో ఇండిపెండెంటుగా, 1994లో తిరిగి టీడీపీ నుంచి, 1999లో కాంగ్రెస్‌ నుంచి, 2009లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మళ్లీ టీడీపీ నుంచి విజయాలు సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంటుగానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మోత్కుపల్లి తర్వాత స్థానం ఆర్‌.దామోదర్‌ రెడ్డి (ఆర్డీఆర్‌)దే. ఆయన తుంగతుర్తి నియోజవర్గం నుంచి 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున, 1994లో ఇండిపెండెంటుగా, 2004లో తిరిగి కాంగ్రెస్‌నుంచి గెలుపొందారు. ఆ తర్వాత తుంగుర్తి ఎస్సీలకు రిజర్వు కావడంతో సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో విజయం సా«ధించిన ఆయన ఇప్పుడు ఆరో విజయం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇద్దరు నేతలు ...ఐదో సారి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి .. ఈ ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులు ఇపుడు ఐదో విజ యం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 1999, 2004 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి, 2009, 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు హుజూర్‌నగర్‌ స్థానం నుంచే ఐదో గెలుపుపై దృష్టి పెట్టారు. మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయనా ఐదో విజయంపై గురిపెట్టారు.

నాలుగో విజయం కోసం .. జూలకంటి
సీపీఎం సీనియర్‌ నాయకుడు జూలకంటి రంగా రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీపీఎం ఇప్పటికే ప్రకటిం చింది. ఆయన మిరాల్యగూడనుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ..1994, 2004, 2009 ఎన్ని కల్లో గెలుపొందారు. నాలుగోసారి ఇదే స్థానం నుంచి విజయం సాధించేందుకు శ్రమిస్తున్నారు.

మూడో విజయంపై ఇద్దరు నేతల కన్ను
ఇక, ఇప్పటికే రెండు పర్యాయాలు విజయం సాదించిన జాబితాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నోము ల నర్సింహయ్య (నాగార్జున సాగర్‌), ఆర్‌.రవీం ద్ర కుమార్‌ (దేవరకొండ) ఉన్నారు. వీరిద్దరూ గతంలో వామపక్ష పార్టీలకు చెందిన వారే కావడం గమనార్హం. నోముల నర్సింహయ్య సీపీఎం తరఫున 1999, 2004 ఎన్నికల్లో విజయం సాధిం చారు. గత ఎన్నికల్లో ఆయన నాగార్జునసాగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓడియారు. ఈసారి టీఆర్‌ఎస్‌ టికెట్‌పైనే సాగర్‌ నుంచి పోటీలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కి మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. దేవరకొండ నుంచి ఆర్‌.రవీంద్రకుమార్‌ సీపీఐ నుంచి 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.

రెండేళ్ల కిందట ఆయన సీపీఐ నుంచి  టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నారు. ఈసారి గెలిస్తే మూడో గెలుపు ఆయన ఖాతాలో చేరనుంది. కాగా, రెండో సారి విజయం కోసం సంకినేని వెంకటేశ్వర రావు (బీజేపీ), టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు వేముల వీరేశం (నకిరేకల్‌), గాదరి కిశోర్‌ కుమార్‌ (తుంగతుర్తి), గొంగిడి సునిత (ఆలేరు), పైళ్ల శేఖర్‌ రెడ్డి (భువనగిరి), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (మునుగోడు), ఎన్‌.భాస్కర్‌ రావు(మిర్యాలగూడ) దృష్టి పెట్టారు. నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో ఉన్న చిరుమర్తి లింగయ్య, దేవరకొండ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌ కూడా రెండో విజయం కోసం ఎదురు చూస్తున్నవారే కావడం గమనార్హం. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరెవరికి టికెట్లు లభిస్తాయన్న అంశం తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు