దిగ్విజయ్ ఎదుటే నేతల బాహాబాహీ

21 Apr, 2017 18:50 IST|Sakshi
దిగ్విజయ్ ఎదుటే నేతల బాహాబాహీ

గాంధీభవన్‌లో దిగ్విజయ్ సింగ్ సాక్షిగా జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా మారింది. రెండు రోజుల పాటు జరుగుతున్న జిల్లా సమీక్ష సమావేశాలలో భాగంగా శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. అందులో పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గూడూరు నారాయణరెడ్డి మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి చివరకు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో సీనియర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. కాసేపటి తర్వాత ఇతర నాయకులు వాళ్లను శాంతింపజేసి బయటకు తీసుకెళ్లడంతో గొడవ సర్దుమణిగింది.

రెండు రోజులుగా దిగ్విజయ్ సింగ్ సమక్షంలో పీసీసీ, డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్న విషయమై చర్చించారు. గురువారం ఐదు జిల్లాలు, శుక్రవారం మరో ఐదు జిల్లాల సమీక్ష సమావేశాలు జరిగాయి. నల్లగొండ జిల్లాలో నాయకులు ఆధిపత్యం చూపించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగింది. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న దిగ్విజయ్.. ఇక్కడేం జరుగుతోందని ఆరా తీశారు. గొడవ మొత్తం ముగిసిన తర్వాత.. ఉత్తమ్ పనితీరు సంతృప్తికరంగా ఉందని దిగ్విజయ్ కితాబిచ్చారు.

మరిన్ని వార్తలు