కాంగ్రెస్‌లో.. టికెట్ల లొల్లి!

10 Nov, 2018 10:37 IST|Sakshi
నార్కట్‌పల్లి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్‌ టికెట్‌ ఇవ్వాలని ఆందోళన చేస్తున్న కార్యకర్తలు

సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి షురూ అయ్యింది. సిట్టింగ్‌ స్థానాలను మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో కనీసం ఏడెనిమిది చోట్ల గందరగోళం నెలకొంది. పోటీదారులు ఎక్కువ కావడం, మహా కూటమి పొత్తులు వెరసి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. తమకే టికెట్‌ వస్తుందన్న భరోసాతో ఉన్న కొందరు నాయకులు ఇప్పుడు హస్తినబాట పట్టారు. గురువారం నాటి పరిణామాలు జిల్లాలో శుక్రవారం ప్రభావం చూపాయి. మహా కూటమి భాగస్వామ్య పక్షాలు పోటీ చేసే స్థానాల సంఖ్య తేలడం జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. ప్రధానంగా నకిరేకల్‌ నియోజక వర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను మహా కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ సీట్లు అడుగుతున్నాయి. ఆలేరు, మునుగోడులను సీపీఐ, కోదాడ, నకిరేకల్‌ స్థానాలను టీడీపీ, నకిరేకల్‌ స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీ తమకు కేటాయించాలని  డిమాండ్‌ పెట్టాయి.

కోదాడలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌గా తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి ఉండడంతో ఇక్కడ టీడీపీకి అవకాశం ఇచ్చే అంశం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు సీపీఐకి ఆలేరు, మునుగోడుల్లో ఏ ఒక్క స్థానాన్ని కేటాయించే అవకాశాల్లేవని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కినుక వహించారు. తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్‌ స్థానాన్ని కేటాయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకత్వం మండిపడుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈసారి తనకే అవకాశం లభిస్తుందని ఆశతో ఉన్నారు. ముందస్తు ఎన్నికలు ఖరారైనప్పటినుంచి ప్రచారం కూడా చేసుకుంటున్నారు.

తీరా ఇప్పుడు నకిరేకల్‌ను ఇంటి పార్టీకి కేటాయిస్తున్నట్లు లీకులు వదలడంతో గందరగోళం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇంటి పార్టీకి నకిరేకల్‌ కానీ, మునుగోడు కానీ కేటాయిస్తారన్న చర్చ జరిగినట్లు చెబుతున్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఇంటి పార్టీకి ఏ స్థానం కేటాయిస్తారన్న విషయం శనివారం దాకా తేలేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు చిరుమర్తికి టికెట్‌ ఇవ్వాల్సిందేనని నియోజకవర్గ కార్యకర్తలు రోడ్డెక్కారు. నార్కట్‌పల్లిలో కొద్దిసేపు రాస్తారోకోకు దిగారు. మాజీ మంత్రి, పీసీసీ మేనిఫెస్టో కమిటీ వైస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీరికి మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. చిరుమర్తికి టికెట్‌ ఇవ్వాల్సిందేనని, లేదంటే తాను, తన సోదరుడు వెంకట్‌రెడ్డి పోటీలో ఉండబోమని ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌ రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది.

ఎక్కడ ... ఎవరికి ?
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన నాయకుల పరిస్థితిపై జోరుగా చర్చ జరుగుతోంది.  రేవంత్‌ రెడ్డితో పాటే వచ్చి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే టికెట్ల హామీ ఇచ్చారని వీరు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తూ బిల్యా నాయక్, సూర్యాపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తూ పటేల్‌ రమేష్‌రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. వీరిద్దరూ ఈ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. కాగా, రేవంత్‌ రెడ్డి కోటాలో ఒకరికి అవకాశం ఇస్తే.. మరొకరికి చాన్సు ఉండదన్న సమీకరణ తెరపైకి వచ్చింది. పటేల్‌ రమేష్‌రెడ్డి సూర్యాపేటలో, బిల్యానాయక్‌ దేవరకొండ నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. కాగా, సూర్యాపేట తనకే ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి భీష్మించారు. మరోవైపు దేవరకొండలో బిల్యానాయక్‌తో పాటు జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన జగన్‌లాల్‌ నాయక్‌ టికెట్‌ పోటీలో ఉన్నారు.

దీంతో ఈ రెండు చోట్ల పంచాయితీ తెగడం లేదు. ఇక, మిర్యాలగూడ స్థానం నుంచి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి ఆశిస్తున్నారు. మరోవైపు ఇదే స్థానంపై తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీకి ఇచ్చే స్థానాల సంఖ్య ఖరారు అయినా, మరో రెండు స్థానాలను కోరుతోందని, ఆ రెండింటిలో మిర్యాలగూడ ఒకటని పార్టీ వర్గాలు  చెబుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్‌ అన్న నిబంధనను అమలు చేస్తే.. ఆయనకు టికెట్‌ రాని పక్షంలో ఆ అవకాశం తనికివ్వాలని ఇటీవలే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. దీంతో ఇక్కడా ఎవరికి టికెట్‌ దక్కుతుందో ఇప్పటికీ తేలలేదు. ఇదే స్థానం నుంచి తనకూ అవకాశం ఇవ్వాలని శంకర్‌ నాయక్‌ పట్టుబడుతున్నారు. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, డాక్టర్‌ రవి, టికెట్‌ రేసులో ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్‌ టికెట్ల కేటాయింపు వ్యవహారం ఆ పార్టీ శ్రేణుల్లో గందగోళం సృష్టించింది. శనివారం అభ్యర్థులను ప్రకటిస్తే కానీ, ఈ గందగరోళానికి చెక్‌ పడేలా కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు