కోమటిరెడ్డి సోదరులకు నాలుగు స్థానాలా?

25 Sep, 2018 10:24 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌ రాజకీయం రక్తి కడుతోంది. టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించి దాదాపు ఇరవై రోజులు కావొస్తున్నా.. ఇన్నాళ్లు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన కాంగ్రెస్‌లో మాత్రం చడీచప్పుడు లేదు. మహాకూటమి పేర టీఆర్‌ఎస్‌ వ్యతిరేక పార్టీలతో పొత్తులు పెట్టుకునే పనిలో ఉం డడమే దీనికి కారణంగా పేర్కొంటున్నా.. అంతకుమించి ఇంకా బలమైన కారణాలే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రాతి నిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడి టికెట్ల కేటాయింపు సహజంగానే ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు జిల్లా కాంగ్రెస్‌లో స్థానాల పంపకం జరుగుతోంది. టీపీసీసీలో జిల్లా నాయకులే ముఖ్య పాత్ర పోషిస్తుండడం, అంతా  నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు ఎన్నికల్లో విజయాలు సాధించిన సీనియర్లు కావడం, ఒక్కో నాయకుడి కనుసన్నల్లో రెండు మూడు నియోజకవర్గాలు ఉండ డం వంటి అంశాలు పార్టీ నాయకత్వానికి ప్రతిబంధకంగా మారిందన్న అభిప్రా యం కూడా ఉంది.
 
కోమటిరెడ్డి సోదరులకు నాలుగు స్థానాలు !
కోమటిరెడ్డి సోదరులకు నాలుగు స్థానాలు ఇస్తున్నారా..ఇది.. నిజమేనా అంటే, అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు. ముందునుంచీ పీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి .సోదరులకు ఆ పదవి లభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో తమకున్న ఫాలోయింగ్‌ను పరిగణనలోకి తీసుకుని పీసీసీలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని భువనగిరి, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాల బాధ్యత తమకే అప్పజెప్పాలని, తాము చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ పెట్టారని సమాచారం. కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ నాయకత్వానికి మధ్య కేంద్ర మాజీ మంత్రి ఒకరు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సన్నిహిత నాయకుడు ఒకరు మధ్యవర్తిత్వం వహించి ఒప్పించారని తెలిసింది.

నల్లగొండ, నకిరేకల్‌ వెంకట్‌రెడ్డి బాధ్యతగా, మునుగోడు, భువనగిరి రాజగోపాల్‌రెడ్డి బాధ్యతగా నిర్ణయం జరిగిందని సమాచారం. ఈ ఒప్పందం జరిగాక అంతా సర్దుకుంటుందన్న సమయంలో టీ.పీసీసీ ఎన్నికల కమిటీలు చిచ్చురేపాయని పేర్కొంటున్నారు. ఈ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడానికి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా నిరసించారు. అడిగిన మేరకు సీట్లు కేటాయిం చాలని ఒప్పందం జరిగాక ఒక విధంగా రాజగోపాల్‌ రెడ్డి తిరుగుబాటు చేసినట్లు మాట్లాడడంపై నాయకత్వం అంతర్మథనం పడుతోందని చెబుతున్నారు. ఇక, వీరి కోటాల దక్కనున్న భువనగిరిలో అన్నీ సవ్యంగా జరిగితే జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.

మరికొన్ని పంపకాలు ..?
వాస్తవానికి జిల్లాలో కాంగ్రెస్‌ నేతల నాలుగు కుటుంబాలనుంచి ఎనిమిది సీట్లు ఆశిస్తున్నారని అంటున్నారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు, జానారెడ్డి, ఆయన తనయుడు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి, రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి ఆయన తనయుడు, ఇలా .. ఒక్కో కుటుంబంలో రెండేసి టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ఆయన సతీమణి ఉత్తమ్‌ పద్మావతి ఇప్పటికే సిట్టింగులు కాబట్టి కోదాడ, హుజూర్‌నగర్‌లు తమకే దక్కాల్సి ఉందంటున్నారు. జానారెడ్డి ఈసారి మిర్యాలగూడ వచ్చి, నాగార్జునసాగర్‌లో తన తనయుడు రఘువీర్‌రెడ్డి బరిలోకి దింపాలనుకుంటున్నారు.

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తన తనయుడు సర్వోత్తమ్‌రెడ్డికి భువనగిరి కావాలని అడుతున్నారని చెబుతున్నారు. అంతకు కావాల్సి వస్తే తాను పార్లమెంటు స్థానంనుంచి పోటీ చేయడానికి సిద్ధమన్న సంకేతాలు కూడా పంపారని అంటున్నారు. జానారెడ్డి సైతం అదే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి ఒక జిల్లాలో నలుగురు కాంగ్రెస్‌ సీనియర్లు రెండేసి సీట్లు కావాలనుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీ.పీసీసీ ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.  

మరిన్ని వార్తలు