రేవంత్‌ ఇంటి వద్ద హైడ్రామా

29 Sep, 2018 02:16 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డీకే అరుణ, సీతక్క

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేవంత్‌ను బయటకు పంపకపోవడం, ఎవరినీ లోనికి అనుమతించక పోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, అనుచరులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డి, దొమ్మిటి సాంబయ్య, పొట్ల నాగేశ్వర్‌రావు, వడ్డేపల్లి సుభాశ్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, హరి ప్రియానాయక్, రాజారాంయాదవ్, బట్టి జగపతి, శశికళా యాదవరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఇంటిబయటే పడిగాపులు కాశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణ, ఎమ్మెల్సీ ఆర్‌.భూపతిరెడ్డిలు వచ్చి కార్యకర్తలకు ధైర్యం చెప్పి వెళ్లారు. అనుచరులు భారీగా వస్తుండటంతో వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.  

సాయంత్రానికి హల్‌చల్‌.. 
సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుండటంతో రేవంత్‌ను తమకు చూపాలంటూ ఆయన అనుచరు లు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బారికేడ్లను తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు యత్నించా రు. దీంతో పోలీసులకు, కార్యర్తలకు మధ్య తోపులా ట జరిగింది. ఆయన అనుచరులు కేసీఆర్, రాష్ట్ర ప్రభు త్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో రేవంత్‌ అభిమాని, కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశా డు. పరిస్థితి అదుపు తప్పుతోందనుకున్న పోలీసులు.. ఐటీ అధికారులకు విషయం తెలిపారు. దీంతో కొద్దిసేపు కార్యకర్తల దగ్గరకు వెళ్లి రావాలని, ఆందోళ న చేయకుండా ఉండేలా సూచించాలని ఐటీ అధికారులే రేవంత్‌కు చెప్పారు. బయటకు వచ్చిన రేవంత్‌.. కార్యకర్తలు, నేతలకు అభివాదం చేశారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, విచారణ శాంతియుతంగానే జరుగుతోందని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. అయినా కొందరు నేతలు, కార్యకర్తలు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వారిని విడిచిపెట్టారు. 

రేవంత్‌కు ప్రాణహాని ఉంది.. 
రేవంత్‌కు ప్రాణహాని ఉందనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని గంటల పాటు ఆయన్ను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓ భూ కబ్జాదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో తనిఖీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే రేవంత్, కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విజయ రమణారావు ఆరోపించారు. రేవంత్‌పై ఎంపీ బాల్క సుమన్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్, కవ్వంపల్లిసత్యనారాయణ, గంట రాములు ఖండించారు. దొర వద్ద బానిసగా బతుకుతున్న బాల్క సుమన్‌కు రేవంత్‌పై విమర్శలు చేసే స్థాయి లేదన్నారు.  

అధికారంలోకి వచ్చాక మీ పరిస్థితేంటి?
రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్‌ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు తన దయాదాక్షిణ్యాల మీద, బానిసలుగా బతకాలని చూస్తున్నారని, ఇలాంటి నియంత పోకడలకు త్వరలోనే చరమగీతం పాడుతామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ ఇలాంటి చర్యలకే దిగితే కేసీఆర్, ఆయన కుటుంబం పరిస్థితేంటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు