చేయిజారుతున్నారు..

21 Oct, 2018 13:24 IST|Sakshi

సాక్షి, మెదక్‌: వలసలతో కాంగ్రెస్‌ సతమతం అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ వలసలను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేసి మరీ టీఆర్‌ఎస్‌ తమ పార్టీలో కలుపుకుంటోంది. నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఎక్కువగా కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. చేయి జారిపోతున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ జోరుగా ప్రయత్నిస్తోంది. టీఆర్‌ఎస్‌ను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ చేరికలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఏ పార్టీ నాయకుడు ఎప్పుడు కండువా మారుస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది.

మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నడుమ పోరు సాగుతోంది. ఈ క్రమంలో ఎదుటి పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ముఖ్య నేతలను, నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు స్వయంగా మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికల వ్యూహాం అమలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలను ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసి ఆపరేషన్‌ ఆకర్‌‡్షకు పదును పెడుతున్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఇది ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. నర్సాపూర్‌ నియోజకవర్గంలో పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

నర్సాపూర్‌ మాజీ సర్పంచ్‌ రమణరావు, వెల్దుర్తి మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆంజనేయులు, కాంగ్రెస్‌ నాయకుడు పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. శివ్వంపేట మాజీ ఎంపీపీ అధ్యక్షుడు గోవింద్‌నాయక్‌ కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. హత్నూర మాజీ ఎంపీపీ అధ్యక్షుడు ఆంజనేయులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మరింత మంది నాయకులు, కార్యకర్తలను చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది.

వలసలతో పార్టీకి నష్టం జరుగుతుందని గుర్తించిన మాజీ మంత్రి సునీతారెడ్డి వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నాయకులతో పార్టీకి నష్టం లేదని, అయితే ఇకపై ఎవ్వరూ పార్టీ వీడకుండా చర్యలు తీసుకుంటున్నామని నర్సాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్‌‡్షకు దీటుగా సమాధానం ఇవ్వాలని మాజీ మంత్రి సునీతారెడ్డి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం.

మెదక్, అందోల్‌ నియోజకవర్గాల్లోనూ.. 
మెదక్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ నియోజకవర్గ, మండల స్థాయి నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చకునేందుకు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడే కాంగ్రెస్‌ ఆశావహులను సైతం తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేస్తోంది. అందోల్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్‌ మండలాల్లో సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను చేర్చుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌ సమక్షంలో టేక్మాల్‌ మండలంలోని పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దుబ్బాక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సైతం చేగుంట, నార్సింగి మండలాల్లోని కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేలా పావులు కదుపుతున్నారు.

>
మరిన్ని వార్తలు