టీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోండి

30 Mar, 2019 02:07 IST|Sakshi

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తోందంటూ సీఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘాని (సీఈసీ)కి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్‌ శుక్రవారం ఢిల్లీలో సీఈసీని కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా గవర్నర్‌ ద్వారా హైదరాబాద్‌లో మూడో దశ మెట్రోను ప్రారంభించారని, ఇది కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. అలాగే ఇటీవల భూ వివాదానికి సంబంధించి ఒక వ్యక్తి తన సమస్యను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియోకు స్పందించి సీఎం కేసీఆర్‌.. నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడి కలెక్టర్‌ వచ్చి సమస్యను పరిష్కరించి రైతుబంధు కింద నగదు ఇస్తారని చెప్పారన్నారు. ఈ ఫోన్‌ సంభాషణను ప్రసార మాధ్యమాల్లో ప్రత్యేక ప్రసారం చేశారన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల భూ వివాదాలున్నా వాటిని పట్టించుకోకుండా కేవలం ప్రచారం కోసం ఎన్నికల ముందు ఇలా కేసీఆర్‌ నేరుగా ఫోన్‌లో మాట్లాడారని, ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనన్నారు.  

ఉద్యమసింహం విడుదల కూడా ఉల్లంఘనే.. 
ఎలాంటి ఆదేశాలు లేకున్నా జాతీయ నేతలైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు రాష్ట్రంలో ముసుగులు వేశారని, ఎన్నికల వేళ తమ పార్టీ నేతలను హింసిస్తున్నారని శశిధర్, నిరంజన్‌ ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’చిత్రాన్ని విడుదల చేయడం కూడా కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక బ్యాలెట్‌ ద్వారా జరిగే నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుని షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.


 

మరిన్ని వార్తలు