ఎన్నికల కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

24 Dec, 2019 19:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓటర్ల జావబితా ప్రకటన చేయకుండా నోటిషికేషన్‌ ఎలా ఇస్తారని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో రెండు శాఖలు కాపాడుతున్నాయని.. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌, పోలింగ్‌ సమయంలో పోలీసులు టీఆర్‌ఎస్‌ను కాపాడుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ఇవ్వకముందే టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నాగిరెడ్డి ఎన్నికల అధికారినా..లేక టీఆర్‌ఎస్‌ కార్యకర్తనా అని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని దొడ్డి దారిన గెలవాలని టీఆర్‌ఎస్‌ చూస్తుందని, మున్సిపల్‌ ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

మరో వైపు కాంగ్రెస్‌ నాయకులు ఎలక్షన్‌ కమిషనర్‌ నాగిరెడ్డిని కలిశారు. సంక్రాంతి పండగ తరువాత నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఈ సందర్భంగా ఎలక్షన్‌ కమిషనర్‌ను కోరారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు హాజరయ్యారు. అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోర్టు సూచనల మేరకు డిలిమిటేషన్‌ జరిగిందన్నారు. జనాభాకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, అయినా కావాలనే ప్రకటించడం లేదని విమర్శించారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా షెడ్యూల్‌ ప్రకటించిందని ఆరోపించారు. రిజర్వేషనల ప్రకటన ఎన్నికల తేదికి ఒక్క రోజు ఉంచడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. షెడ్యూల్‌ మార్చడానికి అవకాశం ఉందని, రిజర్వేషన్‌  ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు