కాంగ్రెస్‌ టికెట్లపై ఉత్కంఠ..! 

29 Oct, 2018 08:31 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్‌ టికెట్ల కేటాయింపుపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు మహాకూటమి పొత్తులు.. కాంగ్రెస్‌ అగ్రనేతలు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో ఇక్కడ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్‌లకు టికెట్లు ఖాయమంటున్న సమాచారం.. మహాకూటమిలోని పార్టీలు కోరుతున్న స్థానాల విషయం ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో రేపు టీపీïసీసీ 
ప్రకటించనున్న అభ్యర్థుల మొదటి జాబితాపై ఆసక్తి నెలకొంది.

సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం తమ అభ్యర్థులను ప్రకటించి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఇప్పటికే పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గత నెల ఆరో తేదీ నుంచి ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ తన అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ పార్టీకి జిల్లాలో నల్లగొండ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడలో  సిట్టింగులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారికే టికెట్లు దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లెక్కన పీసీసీ ప్రకటించే తొలి జాబితాలో సిట్టింగులు.. పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేర్లు ఉంటాయని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మిగిలిన చోట్ల ఎవరికి అవకాశం?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలేరు, భువనగిరి, ము నుగోడు, దేవరకొండ, మిర్యాలగూడెం, నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆలేరులో ఉమ్మ డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్కు దాదాపు టికెట్‌ ఖాయమని చెబుతున్నారు. భువనగిరిలో కుంభం అనిల్కుమార్‌రెడ్డి టికెట్‌ రేసులో ఉన్నారు. ఇక మునుగోడు నుంచి పాల్వా యి స్రవంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ నుంచి జగన్‌లాల్‌నాయక్, బిల్యానాయక్, బాలూనాయక్, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సూర్యాపేట నుంచి ఆర్‌.దామోదర్రెడ్డి, పటేల్‌ రమేష్‌రెడ్డి, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరిని టికెట్‌ వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

మరి మహాకూటమి..?
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వివిధ రాజకీయ పక్షాలతో కూటమి గడుతోంది. సీపీఐ, టీడీపీ, టీజేఎస్, తె లంగాణ ఇంటి పార్టీ మహాకూటమిలో ఉన్నా యి. టీడీపీ కోదాడ, నకిరేకల్, తుంగతుర్తిల్లో కనీసం రెండు స్థానాలను కోరుతోంది. సీపీఐ ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో ఒకటి, అవకాశ ఉంటే దేవరకొండ స్థానాలు ఆశిస్తోంది. ఇక     టీజేఎస్‌ మిర్యాలగూడ, తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్‌ ఆశిస్తున్నాయి. ఇప్పటి వరకు మహాకూటమి పొత్తులు కొలిక్కి రాకపోవడంతో ఈ స్థానాల్లో ఎవరికి టికెట్‌ దక్కుతుందో.. తెలియకపోవడంతో అయోమయం నెలకొంది. టీపీసీసీ నవంబర్‌ ఒకటో తేదీన కొందరు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండడంతో ఆ జాబితాలో ఎవరెవరికి స్థానం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు