టికెట్‌... ప్లీజ్‌! 

8 Mar, 2019 00:35 IST|Sakshi

లోక్‌సభ సీట్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల మకాం 

10న స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరిగే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు హస్తిన బాట పట్టారు. అభ్యర్థిత్వాలపై ఇప్పటికే టీపీసీసీ కసరత్తు పూర్తి చేసి జాబితాను ఢిల్లీకి పంపిన నేపథ్యంలో ఆశావహులంతా అక్కడ మకాం వేస్తున్నారు. వీలున్నంత మంది ఢిల్లీ పెద్దలను కలసి తమకు టికెట్‌ ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నామని,  గతంలోనే పోటీ చేసేందుకు ముందుకు వచ్చినా పార్టీ ఆదేశాల మేరకు చేయలేదని, ఈ దఫా అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ పెద్దలు ఆం టోని, చిదంబరం, కె.సి.వేణుగోపాల్, ముకుల్‌వాస్నిక్‌తోపాటు రాహుల్‌ కార్యాలయంలో పనిచేసే ముఖ్యులను కలుస్తున్నారు. వారి బయోడేటాతోపాటు దరఖాస్తును మరోసారి అందజేసి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.  

10న భేటీ... 
ఈ నెల 9వ తేదీన రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన అనంతరం 10న ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశంలో రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కీలక కసరత్తు జరగనుంది. టీపీసీసీ పంపిన పేర్లతో పాటు ఏఐసీసీ స్వతహాగా చేసుకున్న సర్వేల ఆధారంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం అనంతరం వారం రోజుల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తా రని టీపీసీసీ ముఖ్య నేత వెల్లడించారు. 

మరిన్ని వార్తలు