మేరా దిన్‌ ఆయేగా..!

24 Oct, 2018 12:09 IST|Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : అభ్యర్థుల జాబితా ఇగ వస్తదని.. అగ వస్తదని కాంగ్రెస్‌ ఆశావహులు కళ్లల్లో ఒత్తులేసుకున్నారు. పొద్దుగూకుతోంది.. తెల్లారుతోంది.  ఒక్కొక్క రోజు కాలగర్భంలో కరిగిపోతోంది.. జాబితా జాడ మాత్రం లేదు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఫోర్త్‌ గేర్‌ స్పీడ్‌తో ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్‌ నేతలు మాత్రం రిక్తహస్తాలతో అధిష్టానం దిక్కు చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకో 20 రోజులు కూడా లేదు.  ఒకవైపు మహాకూటమి పొత్తులు.. మరోవైపు టికెట్ల హామీతో ఇతర పార్టీల నుంచి ‘హస్తం’ గూటికి చేరిన నాయకులు.. ఇంకోవైపు సిట్టింగ్‌ స్థానాలు.. సీనియర్ల నియోజకవర్గాలు.. ఇలా  కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామే కానున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు నియోజకవర్గాల్లో.. 
పాలకుర్తి నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన తన సెగ్మెంట్‌లో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌రావు భార్యతోపాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ కూడా ఇక్కడి నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ అభ్యర్థిగా ముందంజలో ఉన్నారు. ఈ టికెట్‌ కోసం నాటా అధ్యక్షుడు జంగసాని రాజేశ్వర్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మొగుళ్ల రాజిరెడ్డితో పాటు మరికొందరు «స్థానికులు దరఖాస్తు చేసుకున్నారు. తీరా టికెట్‌ ఇచ్చాక పొన్నాలకు ఎంత మంది సహకరిస్తారో.. ఎంత మంది హ్యాండిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

నర్సంపేటలో కూటమే పీటముడి..
నర్సంపేట నియోజవర్గం రసకందాయంలో పడింది. ఈ సీటు కోసం మహా కూటమిలోని రెండు ప్రధాన పార్టీలు  పట్టుపడుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా  వరంగల్‌ జిల్లాలో ఒక్క సీటు ఇస్తే అది నర్సంపేట ఇవ్వాలని టీడీపీ పట్టుపడుతోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నారు. ఒక వేళ కాంగ్రెస్‌కు టికెట్‌ ఇస్తే అది దొంతికే అని చెప్పుకోవాలి. అయితే  గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కత్తి వెంకటస్వామి టికెట్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బక్క జడ్సన్‌తో పాటు మేధావి వర్గం నుంచి డాక్టర్‌ విజయ్‌కుమార్, తెలంగాణ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నేత పరికి సదానందం టికెట్‌ ఆశిస్తున్నారు.

పరకాలలో ఎవరికివారు..
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొండా సురేఖ, ఇనుగాల వెంకట్రామిరెడ్డి పార్టీ అభ్యర్థిత్వానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇనుగాల వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పొందారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరడంతో పాటు పరకాల నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. గతంలో ఆమె ఈ నియోజకవర్గం నుంచి ప్రాతిని«ధ్యం వహించారు. కొండా సురేఖకు అధిష్టానం టికెట్‌ ఖరారు చేస్తే రెబల్‌గా బరిలో ఉండాలనే అలోచనలో ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ పోటాపోటీ..
ములుగు నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన దనసరి అనసూయ అలియాస్‌ సీతక్కతో పాటు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్‌ కోసం నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఒక దశలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇద్దరిలో ఎవరికో ఒకరిని భద్రాచలం నియోజకవర్గానికి పంపించాలనే ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది.  స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామారావు, ఇందిర, మాదాసి వెంకటేష్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన దొమ్మాటి సాంబయ్య పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నలుగురిలో ఎవరికి వారు టికెట్‌ తమదే అంటే తమదని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు.  ఇక్కడ టికెట్‌ రాకుంటేæ ఇందిర రెబల్‌గా పోటీలో ఉండే అవకాశం ఉంది. 

వరంగల్‌లో ఆశావహులు ఎక్కువే.. 
వరంగల్‌ పశ్చిమ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రబెల్లి స్వర్ణ  టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైతే నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి ఎవరికి వారుగా టికెట్‌ తనదే అనే ధీమాతో ఉన్నారు. వరంగల్‌ తూర్పు నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అచ్చ విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ కొండా మురళీదర్‌రావు, కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా, మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఎండీ.ఇస్మాయిల్‌ షంశీతో పాటు మరికొందరు ప్రయత్నిస్తున్నారు.   

మరిన్ని వార్తలు