ఎవరికి దక్కేనో టికెట్టు?

10 Oct, 2018 12:27 IST|Sakshi

సాక్షి, మెదక్‌: హస్తం పార్టీలో అభ్యర్థుల ఎంపికపై సరికొత్త మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ మార్గదర్శకాలు ఆశావహుల్లో గుబులు రేపుతున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే తమకు టికెట్‌ దక్కుతుందా? లేదా? అన్న ఉత్కంఠ ఆశావహుల్లో కనిపిస్తోంది.  దీంతో అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అధిష్టానం  ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల ఎంపిక కోసం కొన్ని మార్గదర్శకాలను తయారు చేసినట్లు తెలుస్తోంది.

వరుసగా మూడుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, 30వేల కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఓటమిపాలైనవారు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 25వేల కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారికి టికెట్లు ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీ ఎన్నికల టికెట్లు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.  ఈ నిబంధనలపైనే ఆశావహులు చర్చించుకోవటంతోపాటు కాంగ్రెస్‌ నాయకుల్లో సైతం చర్చనీయాంశం అవుతోంది. సరికొత్త నిబంధనలను అమలు చేస్తే మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ టికెట్లు ఎవరికి దక్కుతాయన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో ఖచ్చితంగా ఈ నిబంధనలను పరిగణలోకి తీసుకుంటుందా? ఏమైనా సడలింపు ఉంటుందా ? అన్న సంశయం వ్యక్తం అవుతోంది.

నిర్ణయం ప్రకటించలేదు..
మెదక్‌ నియోజవర్గంలో మొత్తం 13 మంది ఆశావహులు ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో మాజీ ఎంపీ విజయశాంతి,  మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బట్టి జగపతి మినహా ఎవ్వరూ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. విజయశాంతి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 30వేలకుపైగా మెజార్టీతో ఓటమి పాలయ్యారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ æవిషయమై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.  శశిధర్‌రెడ్డి 2002 ఉప ఎన్నికలు, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశారు. 2004లో గెలుపొందారు. కానీ 2002, 2009 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.  టికెట్‌ ఆశిస్తున్న మరో నాయకుడు బట్టి జగపతి రెండు మార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009, 2014లో టీడీపీ, పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఈ కొత్త నిబంధనలో మూడుమార్లు ఓటమిపాలైతే టికెట్లు నిరాకరిస్తారని, రెండు మార్లు మాత్రమే ఓడిపోయిందనందున కాంగ్రెస్‌ అధిష్టానం ఇద్దరి పేర్లను పరిశీలించే అవకాశం లేకపోలేదు. కాగా వీరితోపాటు కొత్త నాయకులు సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, చంద్రపాల్‌ తదితరులు టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

సునీతారెడ్డికే నర్సాపూర్‌..!
తాజా మార్గదర్శకాలు, సర్వే రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటున్న కాంగ్రెస్‌ అధిష్టానం మెదక్‌ టికెట్‌ ఎవరికి కట్టబెడుతుందోనన్న ఉత్కంఠ కార్యకర్తలు, ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉంటే నర్సాపూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ టికెట్‌ మాజీ మంత్రి సునీతారెడ్డికి ఖాయమని చెబుతున్నారు. తాజా మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ సునీతారెడ్డికే టికెట్‌ దక్కనుంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆమె మూడుమార్లు గెలుపొందారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన సునీతారెడ్డి 2014 ఎన్నికల్లో మాత్రమే ఓటమిపాలయ్యారు. దీంతో అధిష్టానం ఆమెకు తప్పనిసరిగా టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ప్రకటించే మొదటి జాబితాలోనే ఆమె పేరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

మరిన్ని వార్తలు