టికెట్ల పోరు 

19 Sep, 2018 12:51 IST|Sakshi
డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కు దరఖాస్తు అందజేస్తున్న మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌ రాజకీయం వేడెక్కుతోంది. అభ్యర్థుల ఖరారుకు అధిష్టానం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పలుమార్లు హస్తినకేగిన నేతలు తాజాగా గాంధీభవన్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పొత్తులు ఖరారు కాకున్నా.. నేతలు టికెట్ల రేసులో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, షాద్‌నగర్, కల్వకుర్తి, ఎల్‌బీనగర్, కుత్బుల్లాపూర్, పరిగి తదితర స్థానాల్లో ఆశావహులు ఒకరిద్దరే ఉన్నా మిగతా చోట్ల మాత్రం చాంతాడంతా జాబితా ఉండడం కాంగ్రెస్‌ నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది.  
కొత్త పంచాయతీ.. 
చేవెళ్ల నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన కాలె యాదయ్య టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఈ నియోజకవర్గం టికెట్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి ఈసారి తనకే టికెట్‌ ఖాయమని భావించిన తరుణంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే 

దరఖాస్తులివ్వండి..

గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఆశావహుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తోంది. శాసనసభ బరిలో దిగడానికి కదన కుతుహలాన్ని ప్రదర్శిస్తున్న నేతల బయోడేటాలను సేకరిస్తోంది. సమర్థత, సర్వేల ఆధారంగా టికెట్లను కేటాయిస్తామని గతంలో స్పష్టం చేసిన కాంగ్రెస్‌ హైకమాండ్‌.. తాజాగా దరఖాస్తుల స్వీకరణకు తెరలేపడంతో ఆశావహులు గాంధీభవన్‌లో బారులుతీరారు. అక్టోబర్‌ రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ  నేపథ్యంలో తాజాగా స్వీకరిస్తున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి షార్ట్‌ లిస్ట్‌ తయారు చేయాలని పీసీసీకి నిర్దేశించింది. ఈ మేరకు పీసీసీ నివేదించే జాబితాను పార్లమెంటు సభ్యుడు భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది.  కాగా, టికెట్‌ కావాలనుకునేవారు విధిగా దరఖాస్తులు సమర్పించాల్సిందేనని కాంగ్రెస్‌ అధినాయకత్వం స్పష్టం చేయడంతో ఆశావహులు మంగళవారం గాంధీభవన్‌కు తరలివచ్చారు.

డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ను కలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్, పడాల వెంకటస్వామి, రాచమల్ల సిద్ధేశ్వర్, నందికంటి శ్రీధర్, ఇటీవల పార్టీలో చేరిన రోహిత్‌రెడ్డి, ముంగి జైపాల్‌రెడ్డి తదితరులు తమ బయోడేటాలను అందజేశారు. పార్టీకి చేసిన సేవలు, సామాజికవర్గం, అర్థ, అంగబలం తదితర అంశాలను పొందుపరుస్తూ దరఖాస్తులను సమర్పించారు. బుధవారం వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని డీసీసీ సారథి మల్లేశ్‌ చెప్పారు. కేఎస్‌ రత్నం టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడం.. త్వరలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని జరుగుతున్న ప్రచారం.. రేసుగుర్రాల ఆశలపై నీళ్లుజల్లుతోంది. ఈ సీటుపై కన్నేసిన శంషాబాద్‌ మాజీ సర్పంచ్‌ రాచమల్ల సిద్ధేశ్వర్‌ ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడితో టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘం నేత పోచయ్య కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
 
బస్తీమే సవాల్‌.. 
వికారాబాద్‌ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ల నడుమ టికెట్‌ పోరు నడుస్తోంది. వైరివర్గాలుగా వ్యవహరిస్తున్న ఈ మాజీ మంత్రులు టికెట్టు కోసం సర్వశక్తులొడ్డుతున్నారు. ఒకవేళ టికెట్‌ లభించకపోతే ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచిస్తున్నారు. ఎవరికివారు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ నెరుపుతున్న ఈ ఇరువురిని సర్దుబాటు చేయడం అధిష్టానానికి చికాకుగా మారనుంది. మరోవైపు వికారాబాద్‌ అభ్యర్థిని ప్రకటించకుండా టీఆర్‌ఎస్‌ పెండింగ్‌లో పెట్టడం కూడా కాంగ్రెస్‌లో వివాదాలకు ఆజ్యం పోస్తోంది. కాంగ్రెస్‌ నుంచి ఎవరో ఒకరు గులాబీకి గూటికి చేరుతారనే సంకేతాల నేపథ్యంలోనే ఈ టికెట్టును పెండింగ్‌ పెట్టారనే ప్రచారంతో పీసీసీకి ఏమీ పాలుపోవడం లేదు. ఇద్దరూ వికారాబాదే కావాలని పంతాలకు దిగుతుండడం కూడా ఇరకాటంలో పడేసింది.
  
తాండూరులోనూ ఇదే.. 
తాండూరులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో పోటీచేసిన రమేశ్‌ మరోసారి బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటుండగా తాజాగా రోహిత్‌రెడ్డి పార్టీలో చేరారు. టికెట్‌పై హామీ లభించిన తర్వాతే ఆయన పార్టీలో చేరారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రమేశ్‌ అభ్యర్థిత్వంపై మొదట్నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి తాజా పరిణామాలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ త్రయం మధ్య సయోధ్య కుదుర్చడం కాంగ్రెస్‌కు తలకుమించిన భారమే!

పోటీ నామమాత్రమే.. 
కల్వకుర్తి, పరిగి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి టికెట్లకు ఢోకాలేకపోగా.. షాద్‌నగర్, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల్లో ప్రతాప్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వాలపై పార్టీలో ఏకాభిప్రాయం ఉంది. మేడ్చల్‌ టికెట్టుపై మాత్రం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌ పోటీకి విముఖత చూపుతుండడంతో ఎవరిని బరిలో దించుతారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. జంగయ్యయాదవ్, నర్సింహారెడ్డి ఈ స్థానంపై కన్నేశారు. మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్‌పల్లిలో కూడా పెద్దగా ఆశావహులు లేరు. మల్కాజిగిరిలో నందికంటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌.. శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, దేప భాస్కరరెడ్డి, రాజేంద్రనగర్‌లో కార్తీక్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలం టికెట్ల రేసులో ఉన్నారు. 

పట్నంలో పాత కథే.. 
ఇబ్రహీంపట్నంలో పాతకథే పునరావృతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ ఎవరికివారు టికెట్‌ కోసం పావులు కదుపుతున్నారు. ఐదేళ్లుగా గ్రూపులుగా విడిపోయిన పార్టీకి ఈ సారి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ అండతో టికెట్టు కోసం మల్‌రెడ్డి బ్రదర్స్‌ ప్రయత్నాలు సాగిస్తుండగా.. రాజకీయ గురువు, కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్య ఆశీస్సులతో మరోసారి టికెట్‌ లభిస్తుందని మల్లేశ్‌ భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా