చిచ్చు రాజేస్తున్న కాంగ్రెస్‌ జాబితా

14 Nov, 2018 13:07 IST|Sakshi

సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి ప్రకటించిన తొలిజాబితాతో... ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిచ్చు రగులుతోంది. అభ్యర్థులను ప్రకటించిన స్థానాలకు సంబంధించి టికెట్లు ఆశించి భంగపడిన కొందరు నేతలు ఆగ్రహానికి గురవుతున్నారు. కూటమి భాగస్వామ్యంలో భాగంగా రెండు స్థానాలను మిత్రపక్షమైన టీడీపీకి కేటాయించడంతో పోటీ చేసే అవకాశం దక్కక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు దక్కని చోట్ల రెబెల్‌గా బరిలో నిలవాలని భావిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానాన్ని ఆశించిన తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయన సోమవారం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

అలాగే మరికొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఆయా స్థానాలను ఆశిస్తున్న వారు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో డీకే.అరుణ మనుషులుగా ముద్రపడిన వారి నియోజకవర్గాలకు చెందిన సీట్లను మొదటి విడతలో ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్‌నేత జైపాల్‌రెడ్డి తన వర్గానికి మోకాలడ్డుతున్నారనే సమాచారంతో డీకే.అరుణ ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. పెండింగ్‌లో ఉన్న తమ వర్గం నేతలకు సీట్లు దక్కించుకునేలా అధిష్టానంతో సంప్రదింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మూడు స్థానాలు పెండింగ్‌లో ఉంచడం పట్ల కేడర్‌ కూడా తీవ్ర ఉత్కంఠతకు గురవుతోంది.
 
మారుతున్న సమీకరణాలు 
మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ సోమవారం అర్ధరాత్రి పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో ఎనిమిది స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను వెల్లడించగా.. రెండు స్థానాలకు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో టికెట్‌పై ఆశలు పెట్టుకుని నిరాశ ఎదురైన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలు చోట్ల ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్యకర్తలు, అభిమానుల సలహాలు, సూచనలతో తమదైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి టికెట్‌ దక్కకపోవడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రాజేందర్‌రెడ్డి గుడ్‌బై చెప్పేసి... బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసున్నారు.

ఒక వేళ బీజేపీ అధిష్టానం అవకాశం కల్పిస్తే మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ బరిలో నిలవాలని భావిస్తున్నారు. అలాగే టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి కూడా స్వతంత్య్ర అభ్యర్థి బరిలో నిలవాలని తొలుత యోచించారు. అందుకే డీసీసీ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశానికి హాజరుకాలేదు. అయితే, చివరకు ఆయన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అభ్యర్థిగా బీ ఫాం తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం రాత్రి ‘సాక్షి’తో ధృవీకరించారు. లాంఛనంగా బుధవారం నామినేషన్‌ వేస్తానని, 19వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి ఇంకో సెట్‌ దాఖలు చేస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ ఆశావహుల్లో ఎవరికి టికెట్‌ ఇచ్చిన గెలిపించుటామని చెప్పినా అధిష్టానం స్పందించక పోవడం బాధ కలిగించిందని అన్నారు.

కేడర్‌ లేని టీడీపీని బలవంతంగా రుద్దడం ఇష్టం లేక.. అభిమానులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇక జడ్చర్ల నుంచి టికెట్‌ ఆశించిన పారిశ్రామిక వేత్త అనిరుధ్‌రెడ్డి సైతం బుధవారం అనిరుధ్‌రెడ్డి యువసేన సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభిమానుల అభీష్టం మేరకు నడుచుకునేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మరోవైపు కూటమిలో భాగంగా సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్‌ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి కూటమి సభ్యులకు మద్దతుగా నిలవాలని స్పష్టంచేశారు. ఈ సమావేశానికి టీడీపీ అభ్యర్థి ఎర్ర శేఖర్‌ కూడా హాజరై తనకు సహకరించాలని కోరారు. 

ఢిల్లీ వెళ్లిన డీకే అరుణ 
పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ గ్రూపు తగాదాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. అసెంబ్లీ టికెట్ల కేటాయింపు విషయంలో జిల్లాలోని రెండు గ్రూపులు ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచిన మూడు స్థానాలలో కూడా డీకే.అరుణ మనుషులు పట్టుబడుతున్నవే కావడం గమనార్హం. దేవరకద్ర నుంచి డోకూరు పవన్‌కుమార్, నారాయణపేట నుంచి కుంభం శివకుమార్‌రెడ్డి, కొల్లాపూర్‌ నుంచి బీరం హర్షవర్ధన్‌రెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. అయితే సీనియర్‌నేత జైపాల్‌రెడ్డి రంగంలోకి దిగి డీకే.అరుణ మనుషులకు టికెట్లు దక్కకుండా అడ్డుకున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో గద్వాలలో ఎన్నికల ప్రచారంలో ఉన్న డీకే. అరుణ... మంగళవారం ఉదయం ఉన్న ఫలంగా ప్రచారాన్ని నిలిపేసి ఢిల్లీ వెళ్లారు. పెండింగ్‌లో ఉంచిన మూడు స్థానాలకు నేడో, రేపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో నేతలంతా హస్తినలోనే మకాం వేశారు.

మరిన్ని వార్తలు