నెలన్నర కిందటే టచ్‌లోకి..

4 Mar, 2019 02:18 IST|Sakshi

ఎమ్మెల్యేలుగా ప్రమాణం తర్వాత సీఎంను కలిసిన కొందరు కాంగ్రెస్‌ సభ్యులు

అంతకుముందే కేసీఆర్‌తో  సక్కు, కాంతారావు భేటీ

పసిగట్టలేకపోయిన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీ మార్పు నిర్ణయం ఇప్పటికిప్పుడు జరిగింది కాదని, జనవరి తొలి రెండు వారాల్లోనే ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని విశ్వసనీయంగా తెలిసింది. జనవరి 17 నుంచి 20 వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన అనంతరం జనవరి 19న కాంగ్రెస్‌కు చెందిన ఆదివాసీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్కలతో కలసి సక్కు, కాంతారావులు సీఎం కేసీఆర్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, పోడు భూముల సమస్యలపై కేసీఆర్‌తో మాట్లాడారు.

అయితే అంతకంటే ముందే సక్కు, కాంతారావులు సీఎంను కలిశారని, పార్టీ మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారని సమాచారం. సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామని కేసీఆర్‌ వారికి సూచించారని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే కాంతారావు పార్టీపై తనకున్న అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటిం చారు. డీసీసీ అధ్యక్షుల నియా మకం సందర్భంగా కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని తనను సంప్రదించకుండానే నియమించారంటూ పార్టీ పదవులకు కాంతారావు రాజీనామా చేశారు. కానీ దాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకత్వం పట్టించుకోలేదు.

ఐదుగురిని నిలబెట్టినప్పుడే...
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారనే చర్చ గత వారం నుంచి జరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీలకు కలిపి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే బలమున్నప్పటికీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఐదుగురిని (మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి) కేసీఆర్‌ బరిలో దింపినప్పుడే ఈ చర్చ ప్రారంభమైం ది. ఆ సభ్యులు ఎవరనేది మాత్రం శనివారం వరకు సస్పెన్స్‌గానే సాగింది. చివరకు సక్కు, రేగా తాము టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నామని ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. మళ్లీ ఇప్పుడు ఇంకా ఎంతమంది, ఎవరెవరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రకటనలు చేస్తారో అనే ఉత్కంఠకు తెరలేచింది.

‘చే’జారినట్టే..!
కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్టేనని రాజకీయ వర్గాలంటున్నా యి. ఇప్పుడు కాంగ్రెస్‌కున్న 17 మంది, టీడీపీకి ఉన్న ఒక సభ్యుడు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేసినా వచ్చేది 18 ఓట్లేనని, అప్పుడు కచ్చితంగా ద్వితీయ ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ ఓటుతో టీఆర్‌ఎస్‌ లేదా ఎంఐఎంకు చెందిన ఐదో అభ్యర్థి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్న విధంగా రేగా, సక్కులతో ఓటు వేయించకపోయినా అధికార పక్షానికి వచ్చే నష్టం ఏమీ లేదని, కాంగ్రెస్‌కు వచ్చే 18 ఓట్లతో ఆ పార్టీ గెలుపు సాధ్యం కాదని లెక్కలు చెబుతున్నాయి. దీం తో ఇక గ్రాడ్యుయేట్స్‌ కోటాలో బరిలో ఉన్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గెలుపుపైనే గంపెడాశలు పెట్టుకుం ది. మరోవైపు అధిష్టానం ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు.

ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేకుండా ఎన్నాళ్లు కొనసాగుతామని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు సీనియర్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దళిత ఎమ్మెల్యే సంపత్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం, వారికి భద్రత తీసేసి, వారి నిధులు నిలిపేసినప్పుడు పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలైనా, ఏ స్థాయి ప్రజాప్రతినిధులైనా పార్టీపరంగా భరోసా కల్పించకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదని ఆయన వాఖ్యానించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు