కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరిక

14 Jul, 2019 18:38 IST|Sakshi

సాక్షి, నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొర్రెలను కొన్నట్టు కొంటున్నారని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వైఎస్‌ జగన్‌ను చూసి కేసీఆర్‌ ఎంతో నేర్చుకోవాలని హితవుపలికారు. తెలంగాణలో కరువు విలయతాండవం చేస్తున్నా.. ఇప్పటివరకు కరువు మండలాలు ప్రకటించకపోవడం సిగ్గుచేటుని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సెప్టెంబర్ నెలలో శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయాలని, లేనిపక్షంలో రైతులతో జాతీయ రహదారులు ముట్టడి చేస్తామని వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు తన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తానని చెప్పారు. 

మరిన్ని వార్తలు