‘హస్తం’.. ముసలం !      

10 Jul, 2019 06:54 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది ఉమ్మడి  జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి. ఇప్పటికే అసెంబీ, పంచాయతీ, లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికల్లో వరుస వైఫల్యాలు చవిచూసిన ఆ  పార్టీలో తాజాగా సీనియర్‌–ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ముసలం మొదలైంది. కొందరు సీనియర్ల పనితీరు బాగోలేదని, వారి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని మండిపడుతున్నారు. లేనిపక్షంలో రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో మళ్లీ ఇలాంటి ఫలితాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ద్వితీయ శ్రేణి నేతలు వ్యవహరించిన తీరుతో సీనియర్లందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారికి ఏ సమాధానం చెప్పాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇప్పటికే పార్టీలో సీనియర్లు డీకే అరుణ, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లు పార్టీని వీడడంతో ప్రాభావం కోల్పోయి.. పట్టుకోసం పాకులాడుతోన్న కాంగ్రెస్‌కు కొత్త సమస్య వచ్చి పడింది. ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ తమపై ఉన్న వ్యతిరేకతను ఎలా దూరం చేసుకోవాలో తెలియక సీనియర్లు సతమతమవుతున్నారు. 

కేడర్‌లో నైరాశ్యం..! 
వరుస వైఫల్యాలతో ఇటు కార్యకర్తల్లోనూ తీవ్ర నైరాశ్యం నెలకొంది. కాంగ్రెస్‌ నుండి బీజేపీ, టీఆర్‌ఎస్‌కు సీనియర్ల వలసలు.. అసెంబ్లీ, సర్పంచ్, పార్లమెంట్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం.. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకుని పని చేస్తోన్న కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకులను ఆందోళనలో పడేశాయి. ఫలితంగా పట్టు కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగాలా? లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా? అని ఆలోచనలో ఆ పార్టీ శ్రేణులు పడ్డారు. ఇప్పటికే తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగపట్టుకున్న సదరు నాయకులు ‘పుర’ ఎన్నికల వరకు వేచి ఉండి తర్వాత నిర్ణయం తీసుకుందామనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జిల్లా నాయకత్వం పలు చోట్ల సీనియర్లను విస్మరించి కొత్త వారికి అవకాశం కల్పించడాన్ని తప్పుబడుతున్న సీనియర్లు కనీసం మున్సిపాలిటీ ఎన్నికల్లోనైనా పని చేసేవారికి టికెట్లు ఇస్తారా? లేదా కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉండగా.. దాదాపు సగం పురపాలికల్లో కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చే స్థాయిలో ఉంది. దీంతో ప్రస్తుతం బలమైన శక్తిగా అవతరించిన టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే పార్టీ నేతలందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతోంది. కానీ అనేక చోట్ల చెప్పుకోదగ్గ బలమైన నాయకులు లేకపోవడంతో పురపాలిక ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి? పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది? ఎన్ని ‘పుర’ పీఠాలు కైవసం చేసుకుంటుందో అనే చర్చ జరుగుతోంది.
 

మరిన్ని వార్తలు