విప్ ‘జారీ’పోయింది!

29 Nov, 2014 01:11 IST|Sakshi
విప్ ‘జారీ’పోయింది!

‘ద్రవ్య’ బిల్లుకు మద్దతు
 సాక్షి, హైదరాబాద్ : తమ సభ్యులకు జారీ చేసిన విప్‌ను ఉపసంహరించుకుని కాంగ్రెస్‌పార్టీ వ్యూహాన్ని మార్చింది. టీఆర్‌ఎస్‌కు వలస పోయిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని రుజువు చేసేందుకు పన్నిన వ్యూహం నుంచి తన కు తానే వెనక్కు తగ్గడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని కాంగ్రెస్ తొలుత భావించింది.  
 
 అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారమే విప్ జారీ చేశారు.  టీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేయనున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఇదే అంశంపై సీఎల్పీనేత జానారెడ్డి, ఉపనేత జీవన్‌రెడ్డి, కార్యదర్శి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. తర్జన భర్జనల అనంతరం విప్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే జానారెడ్డి సభలో మాట్లాడుతూ,  ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, యావత్‌దేశానికి అంతా కలిసికట్టుగా ఉన్నామన్న సందేశం ఇవ్వడానికి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు తెలుపుతున్నాం. విప్‌ను ఉపసంహరించుకుంటున్నాం’ అని ప్రకటించారు.

మరిన్ని వార్తలు