పొంచి ఉన్న అసమ్మతి

6 Nov, 2018 13:28 IST|Sakshi

కాంగ్రెస్‌ టికెట్ల ప్రకటనతో భగ్గుమనే అవకాశం 

జుక్కల్‌లో స్వతంత్రంగానైనా బరిలో ఉంటామని అంటున్న నేతలు 

అగ్రనేతలకూ తప్పేలా లేని అసమ్మతి లొల్లి..

 బాల్కొండ మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే తీరు..

సాక్షి, నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి పొంచి ఉంది. నివు రు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి నేతలు ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన వెంటనే రచ్చకెక్కే అవకాశాలు న్నాయి. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాల అభ్యర్థిత్వాలకు ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీలో ఉన్నారు. ఎవరికి వారే టికెట్‌ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా ని యోజకవర్గాల్లో అభ్యర్థులెవరో తేలిన వెంటనే ఈ అసమ్మతి భగ్గుమనే పరిస్థితి నెలకొంది.ఈ పరిస్థితిని ఊహించే పార్టీ అధిష్టానం టికెట్ల ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈనెల 2న అభ్యర్థుల ప్రకటన ఉంటుంద ని అనుకున్నారు. కానీ మరో వారం పాటు వాయి దా వేయడం వెనుక అసమ్మతే ప్రధాన కారణమనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈనెల 8న అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలుండటంతో ఆశావహులంతా హైదరాబాద్, ఢిల్లీలో మకాం వేసి, చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. 

సీనియర్లకు తప్పని ఆసమ్మతి సెగ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలకు సైతం ఈ అసమ్మతి సెగ తగలనుంది. మండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి పోటీ చేయనున్న కామారెడ్డి, బోధన్‌ స్థానాల్లో కూడా అసమ్మతి రాగాలు వినిపించనున్నాయి. కామారెడ్డి స్థానానికి తమ పేరును కూడా పరిశీలించాలని నల్లవెల్లి అశోక్‌ వంటి నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రకటన జరిగిన వెంటనే అశోక్‌ తన అసమ్మతి గళాన్ని వినిపించే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే బోధన్‌ స్థానాన్ని ఉప్పు సంతోష్‌ కూడా ఆశిస్తున్నారు. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను ఈ ఇద్దరు సీనియర్‌ నేతలు బుజ్జగించాల్సి ఉండగా., వారికే అసమ్మతి సెగ తగలే అవకాశాలుండటం గమనార్హం.

ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు పోటీ.. 
జిల్లాలో ఒకటీ రెండు, స్థానాలు మినహా మిగిలిన అన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు నేతలు కాంగ్రెస్‌ టికెట్‌ కో సం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు, డీసీసీ అధ్యక్షు లు తాహెర్‌బిన్‌ హందాన్, నరాల రత్నాకర్‌ ఎవరికి వారే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అభ్యర్థిత్వం తేలితే మిగిలిన వారు కలిసి పనిచేసే అవకాశాలు తక్కువే ఉన్నాయి. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో అసమ్మతి సెగలు భగ్గుమననున్నాయి. ఇక్కడ పార్టీలోని సీనియర్‌ నేతలు, కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మొత్తం నలుగురు టికెట్‌ రేసులో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, అలాగే రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిలతో పాటు, సీనియర్‌ నేతలు నగేష్‌రెడ్డి, భూమారెడ్డిలు టికెట్‌ ఆశిస్తున్నారు. టికెట్‌ తనకేననే ధీమాతో భూపతిరెడ్డి ప్రచారం కూడా చేస్తున్నారు. అభ్యర్థిత్వం ఎవరికో తేలితే ఇక్కడ మిగిలిన ముగ్గురు నేతలు తీవ్ర స్థాయిలో అసమ్మతి గళం వినిపించే అవకాశాలున్నాయి.ఆర్మూర్‌ అభ్యర్థిత్వం ఆకుల లలితకు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ., ఇక్కడి టికెట్‌ రేసులో తాను కూడా ఉన్నానని కొత్తగా పార్టీలో చేరిన రాజా రాంయాదవ్‌ పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన రేవంత్‌రెడ్డితో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థిత్వం ప్రకటించాక ఇక్కడ ఆసమ్మతి సెగలు రేగనున్నాయి.

 బాల్కొండలో ప్రస్తుతానికి ఈరవత్రి అనీల్‌ పేరు ఒక్కటే పరిశీలనలో ఉంది. కానీ ఈ స్థానంపై పొత్తులో భాగంగా టీడీపీ కన్నేయడంతో కాంగ్రెస్‌ ఆశావహుల్లో అయోమయం నెలకొంది.ఎల్లారెడ్డి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్న నల్లమడుగు సురేందర్‌తో పాటు, కృష్ణారెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇక్కడ కూడా అసమ్మతి రాగాలు వినిపించనున్నాయి. ఇప్పటికే ఇద్దరు నేతల మధ్య పార్టీ అంతర్గత సమావేశాల్లో సై అంటే.. సై.. అన్నట్లు మాటల యుద్ధం కొనసాతోంది. ఈ నేపథ్యంలో ఒకరికి టికెట్‌ వస్తే.. మరొకరు అసమ్మతి రాగాన్ని వినిపించనున్నారు. బాన్సువాడలో కాసుల బాల్‌రాజ్, మల్యాద్రిరెడ్డి పోటాపోటీగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ టికెట్ల ప్రకటన తర్వాత వీరిలో ఒకరు తిరుగుబావుటా ఎగరవేసే అవకాశాలు లేకపోలేదు.    క్కల్‌లో సౌదాగర్‌ గంగారాం, అరుణతార టికెట్‌ రేసులో ఉన్నారు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా మరొకరు ఏకంగా బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటామని ఇక్కడి నేతలు సంకేతాలు పంపుతున్నారు. దీంతో టికెట్ల ఖరారు తర్వాత ఇక్కడ అసమ్మతి భగ్గుమనే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి సెగలు, తిరుగుబాటు అభ్యర్థులు కొత్తేమీ కాదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో నెలకొంది. 

మరిన్ని వార్తలు