కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ..? 

18 Mar, 2019 17:43 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన నాయకులు, సర్పంచ్‌లు 

సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డిలతో సమావేశం  

19న శంషాబాద్‌లో గులాబీ కండువా కప్పుకోనున్న నాయకులు 

మొయినాబాద్‌: అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్‌‡్షతో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతోంది. మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి సబితారెడ్డి, ఆమె తనయుడు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో వారితో పాటు కాంగ్రెస్‌ నాయకులు, పలువురు సర్పంచ్‌లు కారెక్కెందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న శంషాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో కార్తీక్‌రెడ్డితోపాటు జిల్లాలోని పలు మండలాల కాంగ్రెస్‌ నాయకులు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు గులాబీ కండువ కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి వారి అనుచరులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వరుసగా ప్రతి రోజు సమావేశాలు నిర్వహించి చర్చించుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి మొయినాబాద్‌ మం డల నాయకులు, పలువురు ప్రజాప్రతినిదులు సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డితో సమావేశమైనట్లు సమాచారం. మండలంలోని కాంగ్రెస్‌ నాయకులంతా వారితోపాటే గులాబీ పార్టీలో చేరే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.

మొయినాబాద్‌ మండలంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో అత్యధికులు సబితారెడ్డి అనుచరులే కావడంతో వారిబాటలోనే నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు చాలా మంది నాయకులు అంగీకరించినట్లు తెలుస్తుంది. మండల పార్టీ అధ్యక్షుడితోపాటు ఎస్సీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఎంసీ మాజీ చైర్మన్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు సైతం సబితారెడ్డి కుటుంబం వెనక నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా 19న శంషాబాద్‌లో జరిగే బహిరంగ సభలో గులాబీ కండువాలు కప్పుకోనున్నారు.

 మిగిలేదెవరు? 

ప్రస్తుత రాజకీయ పరిణామాలతో మొయినాబాద్‌ మండల కాంగ్రెస్‌లో మిగిలేదెవరో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికంగా సర్పంచ్‌ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొయినాబాద్‌ మండలంలో సబితారెడ్డి అనుచరవర్గమే అధికంగా ఉంటుంది. ఇప్పుడు వారంతా టీఆర్‌ఎస్‌లో చేరితే మిగిలేది ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీ కొండా విశ్వేశరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం కాంగ్రెస్‌ పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నా వారి వెంట ఎంత మంది నిలుస్తారనేది వేచిచూడాలి.  

మరిన్ని వార్తలు