‘వలస’ ఓట్లను వదలొద్దు

7 Dec, 2018 01:21 IST|Sakshi

కాంగ్రెస్‌ అభ్యర్థులకు హైకమాండ్‌ నుంచి ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: సొంత రాష్ట్రంలో ఉండకపోయి నా ఎన్నికల సమయాల్లో వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే వారిపై కాంగ్రెస్‌పార్టీ దృష్టి పెట్టింది. ఉన్న ఓటర్లతోపాటు వలసఓటర్లను ఆకర్షించేలా ఇప్పటికే కాంగ్రెస్‌ హైకమాండ్‌ అభ్యర్థులకు సూచనలు చేసింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ వలస కార్మికులను ఓటింగ్‌ కోసం రప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లి పట్టణాల్లో నివసిస్తున్న ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తీసుకొచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చింది. రాష్ట్రంలోని సరిహద్దు నియోజకవర్గాల నుం చి కర్ణాటక, మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలకు కార్మికులు వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 50 వేల గిరిజనుల జనాభాలో 35 వేల మంది వలస వెళ్లినవారే.

జహీరాబాద్, జుక్కల్, బోధన్, నారాయణపేట్, ఆదిలాబాద్, బోథ్, అలంపూర్, గద్వాల, మక్తల్, అచ్చంపేట, కల్వకుర్తి, కోదాడ, ఆదిలాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఉపాధి అవకాశాల కోసం వెళ్లినవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఏ పార్టీ అయినా, 5 వేల ఓట్లకు తక్కువ మెజార్టీతోనే గట్టెక్కే అవకాశాలుంటాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది.  రాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షిస్తున్న కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ నేతృత్వంలోని బృందం పోల్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, వలస కార్మికులను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేలా అభ్యర్థులకు మార్గదర్శనం చేసింది. దీంతోపాటే ఉత్తర తెలంగాణలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్ఫ్‌ కార్మికుల కుటుంబాల ఓట్లు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉండటంతో, వారి ఓట్లను రాబట్టుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు