కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రైతుల సంక్షేమం: సినీనటి విజయశాంతి 

3 Dec, 2018 16:41 IST|Sakshi
దోమకొండ రోడ్‌షోలో మాట్లాడుతున్న విజయశాంతి 

బలిదానాల ఫలితంగానే తెలంగాణ 

నలుగురి చేతిలో బందీగా రాష్ట్రం 

దోమకొండ, బీబీపేటల్లో రోడ్‌షో

 సాక్షి, దోమకొండ: దొరల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. ఆదివారం రాత్రి దోమకొండలో ఆమె మండలి విఫక్షనేత షబ్బీర్‌అలీతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురిం చి ప్రజలకు ఆమె వివరించారు. విజయశాంతి రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.   

కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం 

బీబీపేట: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం ముందుకు సాగుతుందని, టీఆర్‌ఎస్‌తో రైతులకు కష్టాలు తప్పవని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ గెలుపు కోసం రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని ప్రజా సంక్షేమం నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న టీఆర్‌ఎస్‌ గ్రామాల్లోని ఒకరిద్దరి పార్టీ నాయకులకు ట్రాక్టర్లు ఇచ్చినంత మాత్రాన అది ఏ కరంగా సంక్షేమం చేపట్టినట్లు అవుతుందని ప్రశ్నించారు.

నాలుగున్నరేళ్ల పాలన లో అభివృద్ధి చేయకుండా మాటల గారడితో ప్రజలను మోసం చేశారని అన్నారు. టీఆర్‌ఎస్‌ వారిని మీ ఓటుతో తరిమికొట్టండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014లో చేసిన తప్పును సరిదిద్దుకొనే అవకాశం మీ ముందు ఉందని కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. ఈ ఎన్నికలు దొరలతో కాంగ్రెస్‌ చేస్తున్న యుద్ధం అని మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ఎమ్మెల్యే అభ్యర్థిగా షబ్బీర్‌ అలీని గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు యూసుఫ్‌ అలీ, ఎంజీ వేణుగోపాల్, జమునా రాథోడ్, మండల నాయకులు భూమాగౌడ్, సుతారి రమేష్, మ్యాదరి సత్తయ్య, విఠల్, వెంకట్‌ గౌడ్, కొరివి నర్సింలు, సాయి పాల్గొన్నారు. 

సభకు భారీగా తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

 భిక్కనూరు: సినీనటి విజయశాంతి దోమకొండ లో నిర్వహించిన రోడ్‌షోకు భిక్కనూరు మండలం నుంచి కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. మండల కేంద్రలోని అన్ని వీధుల గుండా బైక్‌ ర్యాలీ తీసి దోమకొండకు తరలివెళ్లారు. కాంగ్రెస్‌ నేతలు ఇంద్రకరణ్‌రెడ్డి, లింబాద్రి, చంద్రకాంత్‌రెడ్డి, సుదర్శన్, నాగభూషణంగౌడ్, అంకంరాజు, సిద్దగౌడ్, వెంకటిగౌడ్, ప్రభాకర్, కుంట లింగారెడ్డి, కుంట మల్లారెడ్డి, ఎల్లారెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు