‘సహజ న్యాయ సూత్రం’ పరిధిలోకి వస్తుందా?

14 Mar, 2018 02:04 IST|Sakshi

     ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుపై న్యాయ నిపుణులతో కాంగ్రెస్‌ మంతనాలు

     1977లో పంజాబ్‌–హర్యానా హైకోర్టు, 1996లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పుల అధ్యయనం

     2007లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలూ పరిశీలన

     ఏఐసీసీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ మిట్టల్‌తో చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ న్యాయపరమైన మంతనాలు మొదలుపెట్టింది. అసెంబ్లీలో మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం లేదా ఆయన విచక్షణ మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారమైనా స్పీకర్‌కు ఉంటుందనేది స్పష్టమే అయినా స్పీకర్‌ తీసుకున్న ఈ నిర్ణయం సహజ న్యాయ సూత్రాల పరిధిలోకి వస్తుందా లేదా అనే విషయంలో న్యాయ నిపుణులతో చర్చిస్తోంది.

ఈ విషయంలో ఎలాగూ కోర్టుకెళ్లాల్సి ఉంటుందనే అభిప్రాయంతో ఏఐసీసీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ మిట్టల్‌తో సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి చర్చించారు. సీఎల్పీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా న్యాయపరంగా తమకున్న అవగాహన మేరకు ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సలహాలిస్తుండగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాత్రం దీనికి సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. 

ఆ కోర్టు తీర్పులు ఏమిటి... 
కాంగ్రెస్‌ పార్టీ వర్గాల చర్చల్లో వచ్చిన అంశాల ప్రకారం... అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై 1977లో పంజాబ్‌–హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. దేశంలోని ఏ సభకూ ఒక ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం లేదని హరిద్వారలాల్‌ కేసులో స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత 1996లో మధ్యప్రదేశ్‌ హైకోర్టులో దాఖలైన మరో పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం సభకు ఉంటుందని తీర్పునిచ్చారు. దీంతో ఇరు కోర్టుల తీర్పుల విషయంలో వివాదం ఉండేది.

అయితే 2007లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఇలాంటి మరో కేసు వచ్చింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో కొందరు సభ్యులను సభ నుంచి బహిష్కరించడంతోపాటు వారి సభ్యత్వాలను అప్పటి స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ రద్దు చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను అప్పటి చీఫ్‌ జస్టిస్‌ వై.కె. సబర్వాల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. సభ్యత్వాలను రద్దు చేసే అధికారం సభకు ఉంటుందని, కానీ వాటిని రద్దు చేయడానికి ముందు కనీస సహజ న్యాయ సూత్రాలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సూత్రాలను పాటించారా లేదా అనే విషయాన్ని సమీక్షించే అధికారం కోర్టుకు ఎప్పుడైనా ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఈ సహజ న్యాయ సూత్రం అనే లాజిక్‌నే కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ శాసనసభ నుంచి ఇద్దరు శాసనసభ్యులను బహిష్కరించి, వారి సభ్యత్వాలను రద్దు చేయాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, స్పీకర్‌ తీసుకున్న ఈ నిర్ణయం కోర్టులో నిలబడదని వారంటున్నారు. 

సహజ న్యాయ సూత్రాలేవీ..? 
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం సభ్యత్వం రద్దు చేసిన వారికి నోటీసులివ్వడం, వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవడం, అవసరమైతే విచారణ జరపడం, లేదంటే ఎథిక్స్‌ కమిటీకి అప్పగించడం లాంటి పద్ధతులు పాటించాలి. కానీ ఒక్కరోజులోనే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కచ్చితంగా కోర్టులో సవాల్‌ చేస్తాం. 
– మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు