ఓ బలమైన నేత కమలం గూటికి..!

3 Oct, 2019 08:13 IST|Sakshi

కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీ మంత్రితో బీజేపీ నేతల చర్చలు 

కాషాయతీర్థం పుచ్చుకునేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు సమాచారం

సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతోంది. ఇటీవల మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ కుమారులు వీరేందర్, విజయేందర్‌ను ఆకర్షించిన ఆ పార్టీ.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ బలమైన నేత, మాజీ మంత్రిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు వేర్వేరు పార్టీల నుంచి వరుసగా ఐదుసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన సదరు నేత కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. నాలుగైదు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయమై చర్చలు జరిపారనే విషయం బయటకు పొక్కింది. కమలం గూటికి చేరేందుకు ఆయన సుముఖత తెలిపినట్లు సమాచారం. అయితే, పార్టీలో చేరేందుకు కొంత సమయం 
అడిగినట్లు వినికిడి. తను ఒంటరిగా కాకుండా వివిధ జిల్లాలకు చెందిన కొందరు నేతలతో కలిసి మూకుమ్మడిగా పార్టీ కండువా కప్పుకుంటానని వెల్లడించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, మరోపక్క వీలైనంత త్వరగా పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ చర్యలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపు 20 రోజుల్లోపు కమలం గూటికి చేరుతారని ఆ పార్టీకి కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఇది వీలుపడకపోతే ఈ నెలాఖరులోపైనా ఆయన పార్టీలోకి రావడం ఖాయమని బలంగా చెబుతున్నారు.  

టీఆర్‌ఎస్‌ను ఢీకొనడమే లక్ష్యం.. 
మంత్రిగా సేవలందించిన సదరు నేతను పార్టీలోకి తీసుకొస్తే తద్వారా ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకీ తీసికట్టుగా మారుతున్న తరుణంలో రాజకీయ వేదికను కూడా సదరు నేత వెతుక్కుంటున్నట్లు వినికిడి. సుదీర్ఘ రాజకీయ అనుభమున్న కాంగ్రెస్‌ నేతను చేర్చుకోవడం ద్వారా తన అనుచరగణం కూడా కమలం గూటికి వస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. అదేవిధంగా జిల్లాలో కాస్తోకూస్తో పట్టున్న కాంగ్రెస్‌ కూడా మరింత నిర్వీర్యం అవుతుందని, ఈ పరిణామం తమకు అన్నివిధాలాగా లాభిస్తుందని భావిస్తున్నారు. ఫలితంగా అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తాము ఎదుగుతామన్న విశ్వాసం వ్యక్తం చేస్తోంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో అంతలోపు సాధ్యమైనంత మేర తమ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కమలం అగ్రనేతలు యోచిస్తున్నారు. జిల్లాలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సత్తా చాటాలని కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద వచ్చే సాధారణ ఎన్నికల్లోపు టీఆర్‌ఎస్‌ను బలంగా ఢీకొట్టి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాషాయం నేతలు పావులు కదుపుతున్నారు.

నేడు బీజేపీలోకి వీరేందర్‌ గౌడ్‌ 
భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా  సమక్షంలో మాజీ హోంమంత్రి కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌ గౌడ్‌ గురువారం కాషాయం కండువా కప్పుకోనున్నారు. తన సోదరుడు విజయేందర్‌గౌడ్‌ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లనున్నట్లు తన సన్నిహితులు పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా