విడుదల కాని కాంగ్రెస్‌ తొలి జాబితా

11 Nov, 2018 07:41 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా కూడా వెల్లడి కాలేదు. సొంత పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారో కూడా స్పష్టత లేదు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ రూపొందించిన కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను ఈనెల 12 లేదా 13 తేదీల్లో ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్‌ పెరుగుతోంది.

రేపే నోటిఫికేషన్‌.. షురూ కానున్న నామినేషన్ల ప్రక్రియ
నెలరోజుల క్రితం వెలువడిన ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా ఈనెల 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆరోజు నుంచే ఆర్‌డీవో కార్యాలయాలల్లో రిట ర్నింగ్‌ అధికారులు నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారు. 19వ తేదీ నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ. అయితే స్క్రీనింగ్‌ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపిన 74 మందితో కూడిన కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా శనివారం వెలువడుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ వ్యవహారాల  ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా స్వయంగా వెల్లడించారు. అయితే కూటమి పొత్తుల నేపథ్యంలో సీపీఐ, టీజేఎస్‌ తమకు కేటాయించిన సీట్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో జాబితాను వెల్లడించలేదు. ఆదివారం ప్రకటిస్తారేమోనని భావించినప్పటికీ, భక్తచరణ్‌దాస్‌ చేసిన ప్రకటనతో 12వ తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే కూటమి సర్దుబాట్లు కొలిక్కి వస్తే ఆదివారమే అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆందోళనలో ఖరారైన అభ్యర్థులు
ఢిల్లీలో మూడురోజుల సుదీర్ఘ కసరత్తు తరువాత ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. బెల్లంపల్లి సీపీఐకి కే టాయించగా, బోథ్‌ పెండింగ్‌లో ఉంది. సీఈసీ ఆ మోదం తెలిపిన అభ్యర్థుల పేర్లు ఇప్పటికే బహిర్గ తం కావడంతో ఆయా నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్న నాయకులు ఆందోళన బాట పట్టారు. ఖానాపూర్‌ సీటు హరినాయక్‌కు ఇవ్వాలని గాంధీభవన్‌ వద్ద రెండోరోజు కూడా ఆందోళన జరిగిం ది. బెల్లంపల్లి సీటు సీపీఐకి ఇవ్వొద్దంటూ కాంగ్రెస్‌ నాయకులు పట్టుపడుతున్నారు. చివరి వరకు టికెట్టు రేసులో ఉండి నిరాశ చెందిన నాయకులు తమకున్న పలుకుబడితో ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖరారైన తమ పేర్లు ఎక్కడ మారిపోతాయోనని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు.

టీఆర్‌ఎస్‌ బీఫారాల పంపిణీ నేటి నుంచే...
మరోవైపు దూకుడు మీదున్న అధికార టీఆర్‌ఎస్‌ ఆదివారం నుంచే బీ–ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులతో సమావేశం కానున్న కేసీఆర్‌ ఎన్నికల దిశానిర్ధేశం చేయడంతో పాటు బీఫారాలను కూడా అందించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పది మంది అభ్యర్థులు ఆదివారం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి 19 వరకు మంచిరోజులు ఉండడంతో ర్యాలీగా వెళ్లి ఎప్పుడు నామినేషన్లు దాఖలు చేయాలో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్‌ బీఫారాల పంపిణీ జరుగుతు న్నా, తమకు టికెట్లు ప్రకటించకపోవడంపై కాం గ్రెస్‌ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు