కాంగ్రెస్‌ పోరుబాట

27 Aug, 2019 06:23 IST|Sakshi

నేడు దోబీపేట్‌ నుంచి పాదయాత్రకు శ్రీకారం 

ప్రాణహిత–చేవెళ్ల కొనసాగింపు, ‘పాలమూరు–రంగారెడ్డి’ పూర్తి కోసం పోరు 

30న లక్ష్మీదేవిపల్లిలో ముగింపు 

సాక్షి, రంగారెడ్డి : సాగు, తాగునీటి సాధన కోసం కాంగ్రెస్‌ పోరుబాటకు సిద్ధమైంది. మునుపటి ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌ ప్రకారం ప్రాజెక్టును కొనసాగించడంతోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలనే డిమాండ్‌తో మంగళవారం కాంగ్రెస్‌ పాదయాత్ర చేపట్టనుంది. శంకర్‌పల్లి మండలం మహాలింగపురంలో (దోబీపేట్‌) ఉదయం 9 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈనెల 30న చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లిలో ముగియనున్న ఈ పాదయాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. గోదావరి జలాలను ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లాకు అందించేందుకు వైఎస్సార్‌ హయాంలో ప్రణాళిక రూపొందించడంతోపాటు పనులు మొదలుపెట్టారు.

అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉందని ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌ పరిధి నుంచి జిల్లాను తొలగించారు. దీంతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ ఉద్యమబాట పట్టింది. గతంలో పోరుబాట పేరుతో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాణహిత–చేవెళ్లను యథావిధిగా కొనసాగించడంతోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలన్న డిమాండ్‌తో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించామని, వేగవంతంగా పనులు పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. పాదయాత్రను పార్టీలకతీతంగా విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులను సాధించుకుంటేనే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.   

మరిన్ని వార్తలు