‘స్థానిక’ టికెట్లకు..‘సెలెక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌’ విధానం

13 Apr, 2019 04:30 IST|Sakshi

ఎమ్మెస్సార్‌ హయాంలో ఇదే పద్ధతిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కేటాయింపు 

మండల పార్టీ అధ్యక్షులతోనే ప్రతిపాదనలు.. టీపీసీసీ ముఖ్యుల భేటీలో నిర్ణయం 

10 లోక్‌సభ స్థానాల్లో గట్టి పోటీ ...ఆరింట గెలుస్తామని భేటీలో అంచనా 

స్ట్రాంగ్‌ రూంల వద్ద వలంటీర్లు, పార్టీ కేడర్‌తో భద్రత కోసం ఈసీకి ఉత్తమ్‌ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణ యం తీసుకుంది. రానున్న స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల్లో ‘సెలెక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌’అనే విధానాన్ని మళ్లీ తీసుకువచ్చే యోచన చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్‌) పనిచేసిన సమయంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానా న్ని మళ్లీ అమలుచేయాలని భావిస్తోంది. స్థానిక టికె ట్లు గాంధీభవన్‌ నుంచి కాకుండా క్షేత్రస్థాయి నుంచే ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం జరిగే సమావేశంలో వీటి విధివిధానాలు రూపొందించనున్నారు.

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పోలింగ్‌ సరళిని సమీక్షించడంతో పాటు స్థానిక ఎన్నికల వ్యూహ రచన కోసం అందుబాటులో ఉన్న నేతలతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, మహ్మద్‌ అజారుద్దీన్, టీపీసీసీ ముఖ్య నేతలు షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య , చిన్నారెడ్డి, వంశీ చందర్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన తీరుపై నేతలు సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు గాను 10 చోట్ల పార్టీ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చారని, కచ్చితంగా ఆరింట విజయం సాధిస్తామనే అంచనాకు వచ్చారు. ముఖ్యంగా మల్కాజ్‌గిరి, చేవెళ్ల, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాల్లో సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాకు వచ్చారు.  

పాత పద్ధతికి పోదామా..? 
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన టీపీసీసీ ముఖ్య నేతలు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను మం డల కాంగ్రెస్‌ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జులకు అప్పగించాలని నిర్ణయించారు.ఎమ్మెస్సార్‌ పీసీ సీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘సెలెక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌’ పేరుతో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల నుంచే ముం దుగా ప్రతిపాదనలు తెప్పించుకుని, ఆయా పేర్లపై చర్చించి చాలా తక్కువ స్థానాల్లోనే మార్పులు చేశారనే అంశం చర్చకు వచ్చింది. దీనిపై నేతలు కూడా సానుకూలతను వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో సమావేశాలు జరిపి, అక్కడి నుంచే మండల అధ్యక్షుల నుంచి అభ్యర్థుల ప్రతిపాదనలు తెప్పించుకో వాలని స్థూలంగా నిర్ణయించారు. అయితే, దీనిపై మరోసారి భేటీ అవుదామని, వచ్చే వారంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈనెల 15లోగా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో సమావేశాలు జరిపి అభ్యర్థుల ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాపరిషత్‌ చైర్మన్‌ల ఎంపిక మాత్రమే టీపీసీసీ స్థాయిలో చేయాలని, పార్టీ మండలాధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు లేని చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకోండి: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కేడర్‌ కష్టపడిందని, ఎన్నికల్లో పనిచేసిన నేతలు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం కోసం క్షేత్రస్థాయి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద తమ పార్టీ కేడర్, వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ శుక్రవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రెండు, మూడు అంచెల్లో తమ కేడర్‌తో భద్రత ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఈ లేఖలో ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు