రజత్‌కుమార్‌పై మర్రి శశిధర్‌ రెడ్డి ఫైర్‌

23 Jan, 2019 15:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ నుండి 25న జాతీయ ఓటర్ల దినోత్సవ ఆహ్వానం వచ్చిందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి తెలిపారు. ఈ సారి ఓటర్స్ డే థీమ్ ఒక్క ఓటర్‌ను వదిలిపెట్టొద్దని తనతో చెప్పారన్నారు. గత ఎన్నికల్లో లక్షలాది ఓటర్లను తొలగించామని రజత్ కుమార్ అంగీకరించారని, పార్లమెంట్ ఎన్నికల నాటికి అర్హులందర్ని ఓటరు జాబితాలో చేరుస్తామన్న హామీ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అందుకే ఈ ఓటర్స్ డేను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రేపటి ధర్నాలో అధికార పార్టీకి తొత్తుగా ఉన్న ఎన్నికల సంఘంపై తమ వైఖరి చెబుతామన్నారు. ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, డీకే అరుణలతో పాటు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఎంబీటీ నేతలను ఆహ్వానించామని తెలిపారు.

విమానాలు ట్యాంపరింగ్ జరిగితే ఎడ్ల బండిలో తిరుగుతారా? అన్న రజత్ కుమార్ వ్యాఖ్యలపై  శశిధర్ రెడ్డి మండిపడ్డారు. అమెరికా విమానాలను కాదని ఎడ్ల బండిలో తిరుగుతుందా, అక్కడ బ్యాలెట్‌లోనే ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని ధ్వజమెత్తారు. ఈవీఎం మొట్టమొదట ప్రవేశ పెట్టిన జపాన్‌లో కూడా ఇప్పుడు బ్యాటెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా బ్యాలెట్ పేపర్‌లోనే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈవీఎంలపై విశ్వాసం లేదనే వీవీ ప్యాట్ తీసుకొచ్చారని మరిచి పోవద్దన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె రాకతో దేశ వ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు