ఇంత ఓటమేల!

30 Jan, 2020 01:12 IST|Sakshi

పురఫలితాలపై కాంగ్రెస్‌ సమీక్ష.. ∙ప్రత్యేక కసరత్తు చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

30 నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల్లో పేలవ ప్రదర్శన

పోటీ ఇచ్చింది 60 మున్సిపాలిటీల్లోనే..

ఉత్తర తెలంగాణలో భారీ నష్టం

పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్న టీపీసీసీ

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపాలిటీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చూపిన కాంగ్రెస్‌ అందుకు గల క్షేత్రస్థాయి కారణాలపై ఆ పార్టీ ఆరా తీసే పనిలో పడింది. చాలా పురపాలికల్లో ఖాతా తెరవకపోగా, కొన్ని చోట్ల బీజేపీ, ఎంఐఎం, సీపీఐల కన్నా తక్కువ స్థానాలు రావడంపై పోస్టుమార్టం ప్రారంభించింది. ఆయా స్థానాల్లో పార్టీ నాయకత్వం పనితీరు, ప్రభావలేమికి కారణాలు తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదికను టీపీసీసీ సిద్ధం చేస్తోంది. చాలా స్థానాల్లో పేలవ ప్రదర్శనతో పాటు ఓ మోస్తరుగా ఫలితాలు వచ్చిన పురపాలికల్లో పార్టీ బలం పుంజుకునేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలన్న దానిపై టీపీసీసీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని టీపీసీసీ నాయకత్వం ఓ అంచనాకు వచ్చింది.

ఉత్తర తెలంగాణలో అలా..: అధికార పార్టీకి ఉండే సానుకూలతలకు తోడు ఆ పార్టీ ప్రలోభాలు వెరసి మిశ్రమ ఫలితాలు వచ్చాయని టీపీసీసీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో పార్టీ కేడర్‌ గట్టి పోటీ ఇచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలో గత ఎన్నికల కన్నా మంచి ఫలితాలే వచ్చాయని, తమకు వచ్చిన ఓట్లు, సీట్ల విషయంలో సంతృప్తి చెందామని పేర్కొంటున్నారు. అయితే, ఉత్తర తెలంగాణలో పార్టీ భారీ కుదుపునకు గురవుతోందనే విషయాన్ని మున్సిపల్‌ ఎన్నికలు చెబుతున్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ బలపడటం భవిష్యత్తులో తమకు ఇబ్బందేనని భావిస్తున్నారు. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, సిరిసిల్ల, వేములవాడ, నిర్మల్, కోరుట్ల, రాయికల్, మంథని, చెన్నూరు, క్యాతనపల్లి, భైంసా, భీంగల్, భూపాలపల్లి, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, నర్సాపూర్, నస్పూర్, ఆర్మూరు, మెట్‌పల్లి, హుజూరాబాద్, దుబ్బాక, అమన్‌గల్, జల్‌పల్లి, తుక్కగూడ, ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, షాద్‌నగర్, శంషాబాద్, శంకర్‌పల్లి, భూత్పూరు, మహబూబ్‌నగర్, ఆలంపూర్, అమరచింత, కొల్లాపూర్, మక్తల్, నారాయణపేట, మెదక్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, పోచారం, తూంకుంట, దమ్మాయిగూడ స్థానాల్లో బాగా వెనకబడ్డామని తెలుసుకున్నారు.

కొన్ని చోట్ల ఖాతా తెరవకపోగా, మరికొన్ని చోట్ల ఇతర ప్రతిపక్ష పార్టీల కంటే కూడా తక్కువ స్థానాలు రావడంపై సమీక్షిస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలు, ఆ మున్సిపాలిటీలున్న అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో త్వరలో సమావేశం నిర్వహించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ యోచిస్తున్నారు. ఇక, తమ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఒకట్రెండు చోట్ల మినహా మెరుగైన ఫలితాలు రాలేదని, అక్కడ పార్టీకి మెండుగా బలమున్నా నాయకత్వ లేమితో మున్సిపల్‌ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోకలేకపోయామని అంచనాకు వచ్చారు. అందుకే ఆయా స్థానాల్లో బలమైన నాయకులను గుర్తించి, వారికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. రెండు, మూడు మున్సిపాలిటీలున్న నియోజకవర్గాల్లో ఒక చోట మంచి పోటీ ఇస్తే, మరో చోట డీలా పడటానికి గల కారణాలను కూడా ఆరా తీస్తున్నారు. 

ఉత్తమ్‌ ప్రత్యేక కసరత్తు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పార్టీ పనితీరు, సాధించిన ఫలితాలపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన స్థానాల్లో సగం స్థానాల్లో మాత్రమే గట్టిపోటీ ఇవ్వగలిగామని, పట్టణ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అంచనాకు ఆయన వచ్చారు. పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, ఉమ్మడి జిల్లాల పరిధిలో ఫలితాలు ఎలా వచ్చాయన్న దానిపై పరిశీలన జరుపుతున్నారు. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ప్రతిపక్షాల నుంచి తమకు పెద్దగా పోటీ ఉండదని అంచనా వేస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు.. పట్టణ ప్రాంతాల్లో బలంగా లేని చోట్ల ప్రత్యేక కార్యాచరణతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. 

మరిన్ని వార్తలు