‘వారిని ప్రభుత్వ ఖర్చులతో తీసుకురండి’

9 May, 2020 19:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఉచిత రవాణా ఖర్చులతో తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్‌కుమార్ టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తమ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రవణ్‌ దాసోజు మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందడంతో గల్ఫ్ వలస కార్మికుల జీవిన విధానం మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. అదే విధంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళలతో సహా తెలంగాణ నుండి 12-15 లక్షలకు పైగా వలస కార్మికులు ఉన్నట్లు తెలిపారు. ఈ గల్ఫ్ కార్మికుల నుంచి దాదాపు ప్రతి నెల రూ .1500 కోట్ల విలువైన విదేశీ మారకం తెలంగాణ రాష్ట్రానికి పంపబడుతుందని అంచనా అని తెలిపారు. (విదేశాల నుంచి స్వదేశానికి : టికెట్లు ధరలు ఇవే)
 
అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయని, కరోనా వైరస్ కారణంగా ఒకేసారిగా కుప్పకూలిన చమురు ధరల వల్ల అరబ్, గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయిందన్నారు. దీని కారణంగా వారి వ్యాపార కార్యకలాపాల పరిధి కూడా ఒక్కసారి తగ్గడంతో ఫలితంగా చాలా మంది కార్మికులను విధుల, ఉపాధి నుంచి తొలగించారని లేఖలో తెలిపారు. అలాగే కరోనా మహమ్మారి కొంత వరకు తగ్గినప్పటికీ, చమురు ధరలు ఒక్కసారి తగ్గడం ద్వారా  తీవ్రమైన వ్యాపార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, గల్ఫ్ వలస కార్మికులు వారి ఉపాధిని మరియు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని కూడ కూడా పేర్కొన్నారు. ఫలితంగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలలో ఉన్న కార్మికులు వారి జీవనోపాధిపై  తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

భారత్‌లో కరోనా మృతుల సంఖ్య ఎప్పటికీ తేలదు!

వారిలో చాలా మంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి సరైన జీవనోపాధి పొందడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వైద్య సంరక్షణ కూడా వారికీ లేదని, చాలా ప్రమాదకర పరిస్థితులలో గల్ఫ్‌ కార్మికులు జీవించవలసి వస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో  తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్య సహకారంతో సమన్వయం చేసుకొని, గల్ఫ్‌లో ఉన్నటువంటి కార్మికులు భారతదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారో వారిని ఉచిత రవాణా ఖర్చులతో తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల, ప్రాంతాలలో ఉన్న కార్మికులను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన  విమానాల సౌకర్యాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.  అయితే భారతదేశానికి తిరిగి రావడానికి విమాన ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేయడం సరికాదని శ్రావన్ అన్నారు. కార్మికులు ప్రస్తుత పరిస్థితులలో వారికీ ఎలాంటి ఉపాధి, ఆదాయం లేకుండా ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
 
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుండి విమానాల ద్వారా హైదరాబాదుకు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వమే కార్మికుల విమాన ఛార్జీలు చెల్లించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. అంతేగాక హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఆయా గ్రామాలకు స్థానిక రవాణా ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణకు తిరిగి వచ్చిన తరువాత, ఆ కార్మికులకు గౌరవంగా మంచి జీవన ప్రమాణాలతో వారి స్వస్థలాలలో స్థిరపడటానికి వారికి పునరావాసం, పునర్వవస్థీకరణము ప్యాకేజీని ఇవ్వాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకరించిన గల్ఫ్ కార్మికుల కోసం మనం చేయగలిగిన అతి చిన్న సహాయం ఇదేనని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు