అలుపెరగని రాజకీయ యోధుడు

28 Jul, 2019 08:45 IST|Sakshi

ఐదుసార్లు లోక్‌సభకు, నాలుగుసార్లు శాసనసభకు

జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు

దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం

రాజకీయాల్లో అజాతశత్రువు జైపాల్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అలుపెరుగని రాజకీయ యోధుడు.. సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో కొనసాగుతూ.. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ తనదైన ముద్రవేసిన విలక్షణ నాయకుడు ఎస్‌ జైపాల్‌రెడ్డి. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఐదుసార్లు ఎంపీగా గెలుపొంది.. కేంద్రంలో కీలక మంత్రులు నిర్వహించిన జైపాల్‌రెడ్డి తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారు. నిజాయితీ, నిర్భీతిగల నాయకుడిగా, అవినీతి మరక అంటని సచ్ఛీలుడిగా జాతీయ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్‌ రెడ్డికి విశిష్ట గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన జైపాల్‌రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీతో విభేదించి జనతా పార్టీలో చేరారు. అనంతర కాలంలో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. అనేక పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారని అంటారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా, నిరంతర కార్యశీలిగా, రాజకీయ దిగ్గజంగా పేరొందిన ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయిందని రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వ్యక్తమవుత్నునాయి.

ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యే
 రాజకీయంగా తెలంగాణలోని మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో ప్రత్యక్ష పరిచయాలున్న జైపాల్‌ రెడ్డి.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్‌ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్‌ లిట్‌రేచర్‌లో పట్టా పొందారు. విద్యార్థి దశనుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న జైపాల్‌రెడ్డి.. మొదట కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే, 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. ఆ సమయంలో 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జన్సీ అనంతరం 1980లో ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి జైపాల్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా.. ఇందిరకు దీటైన పోటీని ఇచ్చారు. అంతకుముందు 1969లో తొలిసారి మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్‌రెడ్డి .. నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1998, 1999, 2004 2009 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందారు. 

1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1977లో కాంగ్రెస్‌ను వీడిన జైపాల్‌ తిరిగి 1999లో మళ్లీ అదే గూటికి చేరారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఉద్యమం ఉదృతం సాగుతున్న సమయంలో కేంద్రమంత్రిగా కీలక బాధ్యతల్లో జైపాల్‌.. కేంద్రంచే బిల్లును ఆమోదం పొందించుటలో కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో నేతలు తెలంగాణ ఏర్పాటుకు ఒప్పిండంలో సఫలమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పాల్గొన్నారు.

డీకేతో విభేదాలు..
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూశారు. అవే ఆయన ప్రత్యక్షంగా పొల్గొన్న చివరి ఎన్నికలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీని నడిపించడంతో జైపాల్‌ ముందున్నారు. అయితే కాంగ్రెస్‌కు చావోరేవోగా మారిన 2019 అసెంబ్లీ  ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాజీమంత్రి డీకే అరుణతో విభేదాలు పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చాయి. జిల్లాపై పట్టుకు ఇద్దరు నేతలు పోటీపడి.. ఉన్న కార్యకర్తలను దూరం చేసుకున్నారు. జైపాల్‌ కొంత వెనక్కి తగ్గినా.. ఎన్నికల అనంతరం డీకే కాంగ్రెస్‌ను వీడారు.  కాగా దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొత్తం ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు.

మరిన్ని వార్తలు