ఎనిమిది స్థానాలపై వీడని ఉత్కంఠ

17 Nov, 2018 12:54 IST|Sakshi

నామినేషన్ల గడవు దగ్గర పడుతుండటంతో తీవ్ర ఉత్కంఠ

మహబూబ్‌నగర్‌ జిల్లాపై డీకే, జైపాల్‌ మంకుపట్టు

శశిధర్‌ రెడ్డికి సికింద్రాబాద్‌ దక్కెనా?

సాక్షి, హైదరాబాద్‌ : నామినేషన్ల గడవు ముంచుకొస్తున్నా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. కూటమిలో భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన సీట్లుపోను ఇంకా ఎనిమిది స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒక చోట మిత్రపక్షాలు పోటీ పడుతుండగా, మరొకచోట ఒకే పార్టీలోనే నేతలు తాము చూసించిన అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలని భీష్మించుకుని కూర్చున్నారు. నేతల మంకుపట్టుతో ఈ ఎనిమిది స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇంకా ఖరారు కాని స్థానాలు..
సికింద్రాబాద్‌, పటాన్‌చెరు, నారాయణ్‌ ఖేడ్‌, కోరుట్ల, దేవరకద్ర, నారాయణపేట, వరంగల్‌ ఈస్ట్‌, మిర్యాలగూడ.

వీటిలో ఆరు స్థానాలు కాంగ్రెస్‌, రెండు టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు డీకే అరుణ, జైపాల్‌రెడ్డి వేర్వేరు అభ్యర్థులను సూచించడంతో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌లోని దేవరకద్ర, నారాయణపేట స్థానాలకు ఇంకా అభ్యర్థులను తేల్చలేకపోతోంది అధిష్టానం. తన పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో తాను ప్రాతిపాదించిన అభ్యర్థికే సీటు కేటాయించాలని జైపాల్‌ రెడ్డి పట్టుపడుతుండగా.. తన జిల్లాలోని స్థానంలో తాను సూచించిన వ్యక్తికే టికెట్‌ కేటాయించాలని డీకే అరుణ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఆ రెండు స్థానాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో  వీటిపై తుది నిర్ణయం రాహుల్‌ గాంధీకి అప్పగించినట్లు సమాచారం. నారాయణపేట టికెట్‌ కోసం శరత్‌కృష్ణ, శివ కుమార్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు టికెట్‌పై ధీమాతో ఉన్నారు. దేవరకద్ర స్థానంలో పోటీకి పవన్‌కుమార్‌ రెడ్డి, ప్రదీప్‌ కుమార్‌ గౌడ్‌ సిద్ధంగా ఉన్నారు. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ఆయన కోరుకున్న సనత్‌ నగర్‌ టీడీపీకి కేటాయించడంతో సికింద్రాబాద్‌ నుంచి పోటీకి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానంలో టికెట్‌ కోసం నగర మాజీ మేయర్‌ బండా కార్తిక రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీ పడుతున్నారు. వారిని కాదని శశిధర్‌ రెడ్డికి టికెట్‌ దక్కుతుందో లేదో అన్న అంశం ఆసక్తిగా మారింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్లలో కూడా ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. ఇక్కడి నుంచి జువ్వాడి నర్సింగరావు, కొమిరెడ్డి రాములు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నారాయణఖేడ్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, సంజీవరెడ్డి టికెట్‌ కోసం నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఇక వరంగల్‌ ఈస్ట్‌లో గాదె ఇన్నయ్య, ఒద్దిరాజు రవిచంద్ర పోటీ పడుతున్నారు. మిర్యాలగూడ సీటు కోసం జానారెడ్డి తనయుడు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్లకు గడవు లేకపోవడంతో రేపు సాయంత్రంలోపు ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు