మజ్లిస్‌తో దోస్తీ చేద్దామా?

15 Sep, 2014 01:50 IST|Sakshi
మజ్లిస్‌తో దోస్తీ చేద్దామా?
  • గ్రేటర్ ఎన్నికలపై టీపీసీసీ వ్యూహం
  •  జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం పరిశీలిస్తున్న టీపీసీసీ  
  •  నేడు గ్రేటర్ నేతలతో భేటీ
  •  సాక్షి, హైదరాబాద్: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గ్రేటర్ కాంగ్రెస్ నాయకులతో సోమవారం టీపీసీసీ సమావేశం కానుంది. టీఆర్‌ఎస్ వంద రోజుల పాలన-హైదరాబాద్‌పై ప్రభావం అన్న అంశంతో పాటు కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రధానంగా మజ్లిస్ పార్టీతో పొత్తుపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ర్ట కాంగ్రెస్ నేతలతో సమావేశమై గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖ రారు చేయనున్నారు. కాగా, మజ్లిస్‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ వంటి నేతలు మజ్లిస్‌తో పొత్తుకు సానుకూలంగా ఉండగా, మిగిలిన నాయకులు, ప్రధానంగా పాతబస్తీకి చెందిన నేతలు పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.  
     
    ఇక టీపీసీసీ భవిష్యత్ కార్యాచరణపై సోమవారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశానికి దిగ్విజయ్ హాజరుకానున్నారు. గత నెల 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో వెల్లడైన అభిప్రాయాలు, చేసిన తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఎజెండాను ఖరారు చేయనున్నారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పార్టీ నేతల పనితీరుపైనా సమావేశంలో చర్చించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ సహా పార్టీ ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
     
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా