లోక్‌సభ అభ్యర్థుల ఖరారు

6 Apr, 2014 02:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సుదీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం శనివారం రాత్రి ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో కసరత్తు చేసిన అనంతరం అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అన్ని కోణాల్లో పరిశీలించిన అభ్యర్థుల జాబితాను రూపొందించింది.
 
సోనియా ఆమోద ముద్ర పడిన తర్వాత ఈ జాబితాను ప్రకటించారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ నరేష్‌జాదవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. నరేష్ జాదవ్ పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. ఎస్టీ డిపార్ట్‌మెంట్ మాజీ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు నరేష్‌జాదవ్ అభ్యర్థిత్వానికి కలిసొచ్చినట్లయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ పంపిన జాబితాలో మొదట నరేష్‌జాదవ్ పేరునే ప్రతిపాదించారు.
 
 పెద్దపల్లి నుంచి వివేక్

 పెద్దపల్లి(ఎస్సీ) లోక్‌సభ స్థానం నుంచి జి.వివేక్ పేరును ఖరారు చేసింది. ఆయన టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, ఇటీవల సొంత గూటికి చేరుకున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గం పరిధిలో జిల్లాలోని చెన్నూరు (ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ), మంచిర్యాల అసెంబ్లీ స్థానాలున్నాయి.
 
నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

ముందుగా తెలంగాణలోని 110 ఎమ్మెల్యే స్థానాలు, 16 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జిత్‌వాల ప్రకటించారు. చివరి క్షణంలో ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటన ఆగిపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. టిక్కెట్లు ఆశిస్తున్న జిల్లా ముఖ్యనాయకులు పక్షం రోజులుగా హస్తినాలోనే మకాం వేశారు.
 
 తమ బెర్తులను ఖరారు చేసుకునేందుకు ఏఐసీసీ ముఖ్యనేతల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఎలాగైనా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. ఆదివారం ప్రాదేశిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటన ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో చివరి క్షణంలో జాబితాను నిలిపివేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

మరిన్ని వార్తలు