అందరి దృష్టి నల్లగొండ మీదే

14 Mar, 2016 13:09 IST|Sakshi

రౌడీ రాజకీయాల నుంచి విసునూరు వారసుల వరకు హాట్ హాట్ చర్చ
రాజగోపాల్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యే వీరేశం
అంతకు ముందే నల్లగొండలో మాటల తూటాలు పేల్చుకున్న ఆయా నేతలు
కాంగ్రెస్ లోనూ పదవుల పందేరంపై చర్చ
జానా, ఉత్తమ్ లను తప్పిస్తారని, కోమటిరెడ్డికి బాధ్యతలిస్తారని ప్రచారం
బడ్జెట్ సమావేశాల్లో రాజకీయమంతా జిల్లా చుట్టూనే


సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీలగిరి రాజకీయం రక్తి కడుతోంది. వారం రోజులుగా అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు అసెంబ్లీకి చేరింది. రాష్ట్ర శాసనసభా బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు మాటల తూటాలు పేల్చుకుంటుండడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై చర్చ మరోసారి ప్రారంభం కావడంతో ఇప్పుడు హైదరాబాద్‌లో అందరి దృష్టి మన జిల్లా మీదే ఉంది. ముఖ్యంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని కోమటిరెడ్డి సోదరులు అటు శాసనసభలోనూ, ఇటు శాసనమండలిలోనూ మాట్లాడుతుండడం, అందుకు ప్రతిగా జగదీశ్‌రెడ్డి కౌంటర్‌లు వేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో రౌడీ రాజకీయాలు, విసునూరు రామచంద్రారెడ్డి వారసులంటూ ఆవేశపూరిత వ్యాఖ్యానాలు, ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసుననే ఎత్తిపొడుపు మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరపై మరోసారి ఢిల్లీ స్థాయిలో చర్చలు ప్రారంభం కావడం, ఈ పందేరంలో మన జిల్లాకు చెందిన ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఇప్పుడు రాష్ట్రంలో జిల్లా రాజకీయాలే హాట్‌టాపిక్‌గా మారాయి.

 రౌడీలు... విసునూరు వారసులు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి. జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నల్లగొండ జిల్లాలో ఉండే 15 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాంతిభద్రతల అంశంపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. నల్లగొండలో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన అనడం సీన్‌ను మరింత హాటెక్కించింది. అయితే, అందుకు ప్రతిగా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. డబ్బుతో రాజకీయాల్లో ఏదైనా చేయవచ్చని అనుకునే రీతిలో కోమటిరెడ్డి సోదరులు వ్యవహరిస్తున్నారని, జిల్లాలో విసునూరు రామచంద్రారెడ్డి వారసులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది. ఆ పార్టీ పక్షాన జిల్లాకు చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మెదక్‌జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులను దుయ్యబట్టారు. ఎవరి చరిత్ర ఏంటో జిల్లా ప్రజలకు తెలుసునని, అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో వారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కోమటిరెడ్డి శిబిరం ఎలా స్పందిస్తుందో, చర్చ ఎటువైపుకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. అయితే, అసెంబ్లీలో ప్రతిపక్షాలు డీలాపడిపోయి బడ్జెట్ సమావేశాలు స్తబ్దుగా జరుగుతాయని అందరూ భావించిన తరుణంలో జిల్లాను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు వేడెక్కుతుండడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

 డిండి రెండేళ్లలో..
కాగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని సాగునీటి మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. నల్లగొండ ఫ్లోరైడ్ విముక్తికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన ఆయన కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు విషయంలో తాత్సారం జరిగిందని, డీపీఆర్ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోకుండా నాన్చిందని, ప్రస్తుత సీఎం కేసీఆర్ మాత్రం డిండి ఎత్తిపోతలపై పట్టుదలగా ఉన్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.
 
 పదవులు పోయేనా..?

 టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల ఆరోపణల మాట అటుంచితే... ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై జరుగుతున్న చర్చ అటు ఆ పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే జరిగేదా.. అనే మీమాంస ఉన్నా అటు సీఎల్పీ నేతను, ఇటు పీసీసీ అధ్యక్షుడిని ఆయా పదవుల నుంచి తప్పిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రారంభమైన ఈ చర్చలో కూడా జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పేర్లే వినిపిస్తున్నాయి.

తన సోదరుడిని ఎమ్మెల్సీగా గెలిపించుకుని ఊపు మీదున్న వెంకటరెడ్డి అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను తెలంగాణ వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చేసిన వ్యాఖ్యల ఆంతర్యంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానాలకు పదవీగండం ఉందని, ఇద్దరికీ ఏఐసీసీలో స్థానం కల్పిస్తారని కూడా పత్రికలు కోడై కూస్తున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్ష పదవికి ఇప్పట్లో ఉన్న ప్రమాదం ఏమీ లేదని, అయితే, సీఎల్పీ నేతను మాత్రం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం ఇతర జిల్లాలకు చెందిన జీవన్‌రెడ్డి, అరుణ లాంటి నాయకుల పేర్లు వినిపిస్తున్నా, పీసీసీ అధ్యక్ష పదవికి జరుగుతున్న చర్చలో మాత్రం ఉత్తమ్‌ను తప్పిస్తే ఆ పదవిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఇస్తారని ప్రచారం జరుగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలు కూడా జిల్లా నేతలను కేంద్రంగా చేసుకుని హాట్‌హాట్‌గా మారుతున్నాయి.

 నల్లగొండ డీఎస్పీ కార్యాలయం నుంచి మొదలు
 జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్న రాజకీయం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి హల్‌చల్ చేయడం, ఆ తర్వాత టీఆర్‌ఎస్ నేతలు దానిని ఖండించడం, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడం, మళ్లీ టీఆర్‌ఎస్ నాయకులు దానిని ఖండించడం, ఆ తర్వాత నకిరేకల్ నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం వరకు ఈ ఆరోపణల పరంపర వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలోనే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలు ఓ పక్షాన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలైన కోమటిరెడ్డి సోదరులు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అండ్‌కో మరో పక్షాన మాటల దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం, పది రోజులుగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జిల్లాస్థాయిలోనే హాట్ హాట్ గా మారింది. కానీ, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో జిల్లా రాజకీయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది.

మరిన్ని వార్తలు