ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌

5 Nov, 2018 10:39 IST|Sakshi
 మాట్లాడుతున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఆదివారం యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై కేసులు వేయడం కాంగ్రెస్‌ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. సాగునీరు రావాలంటే మాయా కూటమికి బుద్ధి చెప్పాలన్నారు. 


సాక్షి, యాదాద్రి : తెలంగాణలోని కోటి ఎకరాలకు నీళ్లు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకుంటున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఆదివారం యాదగిరిగుట్టలో జరి గిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ప్రాజెక్టులపై కేసులు వేయడం కాంగ్రెస్‌ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. గోదావరి మీద కడుతున్న కాల్వలను ఆపాలనుకుంటున్న చంద్రబాబుకు అధికారం ఇస్తే మన చేతితో మన కళ్లు పొడుచుకున్నట్లేనన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార  ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు 1.40లక్షల ఎకరాలకు కచ్చితంగా సాగునీరందిస్తామని ఎవరూ అడ్డుకున్నా ఆగబోవన్నారు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ పూర్తవుతుందని దాంతో ఈప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. 2001 నుంచి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కడుతూ వచ్చారన్నారు. మూడుసార్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించారని మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. ఆలేరుకు సాగునీరు రావాలంటే మాయ కూటమికి బుద్ది చెప్పాలన్నారు. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సవరిస్తూ గుండాలను తిరిగి యాదాద్రిభువనగిరి జిల్లాలో కలిపేందుకు సీఎం కృషి చేస్తారన్నారు.
  
సాగునీరు అందించడమే ధ్యేయం : గొంగిడి  
2014 ఎన్నికల్లో ఆలేరు ప్రజలు ఆశీర్వదించారని, అదే తరహాలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవలనే మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ యాదగిరిగుట్ట, ఆలేరు పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చడంతో పాటు వాటి అభివృద్ధికి రూ.40కో ట్లు కేటాయించారన్నారు. హెచ్‌ఎండీఏలో ఉన్న బొమ్మలరామారం మండలం అభివృద్ధికి రూ.5కో ట్లు కేటాయించారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన మోటకొండూర్‌ మండలానికి మౌలిక సదుపాయాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడగానే తీసుకువస్తానన్నారు. జిల్లా విభజనలో భాగంగా గుండాల మండలం జనగాంలో కలిసిందని, ఆ మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో చేర్చే విధంగా కృషి చేస్తానన్నారు.

కాల్వలకు నీరు రావాలంటే ..
కేసీఆర్‌ సీఎం కావాలి : బూర న​ర్సయ్యగౌడ్‌
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి కాల్వలకు నీరు రావాలంటే.. కేసీఆర్‌ మరో సారి సీఎం కావాలని భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్‌ నుంచి గంధమల్ల రిజర్వాయర్‌లోకి నీళ్లు తీసుకువచ్చి ఆలేరు రైతాంగానికి అందించేందుకు గొంగిడి సునీత కృషి చేస్తున్నారని తెలిపారు. 66 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేదని విమర్శించారు. అదే టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక బీబీనగర్‌కు నిమ్స్, భువనగిరికి కేంద్రీయ విశ్వవిద్యాలయం, పాస్‌పోర్ట్‌ కార్యాలయం తీసుకువచ్చామన్నారు. అంతే కాకుండా దండు మల్కాపురంలో ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటు చేశామని, యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో 120 ఎకరాల్లో ప్లాస్టిక్‌ ఫర్నిచర్‌ ప్రాజెక్టుకు పునాది ప్రక్రియ మొదలైందన్నారు. కాల కూటమి పేరుతో మహా కూటమి మోసం చేయడానికి వస్తుందని దుయ్యబట్టారు. త్వరలో జరిగే ఎన్నికలు కేసీఆర్‌ వర్సెస్‌ కుట్రల కూటమికి మధ్య జరుగుతున్నాయని తెలిపారు. 
 
విజయోత్సవ సభ : బడుగుల  
యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభను చూస్తుంటే ఎన్నికల ప్రచార సభలా లేదని, గొంగిడి సునీతమ్మ విజయోత్సవ సభలా ఉందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. రేపటి ఎన్నికల్లో గొంగిడి సునీతను లక్షా మేజార్టీతో గెలిపించాలన్నారు.
 
యాదాద్రికి సుస్థిర స్థానం : గుత్తా 
కేసీఆర్‌ నాయకత్వంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దేశంలోనే సుస్థిర స్థానం లభించిందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌తోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నది జలాల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారని వెల్లడించారు.

గులాబి శంఖారావం మోగించాలి : మందుల సామేల్‌
 
ఆరుట్ల రాంచంద్రారెడ్డి వారసులై.. ఆరుట్ల కమాలాదేవి ఆడ బిడ్డలై ఇక్కడి ప్రజలు ఆలేరు నుంచే గులాబి శంఖారావాన్ని మోగించాలని గిడ్డంగుల శాఖ సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ అన్నారు. ఏ పార్టీ ఏ కూటమి ప్రజల ముందుకు వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీదే ఘన విజయం అన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, అటవీశాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి, మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డి, ఆల్డా చైర్మన్‌ మోతే పిచ్చిరెడ్డి, ఆలేరు మార్కెట్‌ కమిటి చైర్మన్‌ పడాల శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు