మెజారిటీ సీట్లు గెలుస్తాం

5 Feb, 2019 03:12 IST|Sakshi

మోదీ–రాహుల్‌ యుద్ధంలో న్యాయానిదే విజయం

కాంగ్రెస్‌ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి

టీడీపీపై ప్రజల్లో ఇంకాచాలా కోపం ఉందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌.. రాష్ట్రంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి, కో–చైర్మన్‌ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్, మోదీ మధ్య జరిగే యుద్ధంలో న్యాయం గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రచార కమిటీ సభ్యులు అనిల్‌కుమార్‌ యాదవ్, ఆకుల రాజేందర్, బెల్లయ్య నాయక్, చామల కిరణ్‌ రెడ్డి, నేరెళ్ల శారద, కోటూరి మానవతారాయ్, అనిల్‌ తదితరులతో కలిసి డీకే అరుణ నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తనకు ప్రచార కమిటీ చైర్మన్‌ బాధ్యతలను అప్పగించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ.. కుట్రలు, కుతంత్రాలు చేసి, కోట్ల రూపాయలు ధారపోసి గెలిచిందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీపై ఇక్కడి ప్రజల్లో కోపం ఉన్న మాట వాస్తవమేనని విజయశాంతి అన్నారు. ఆ కోపాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకున్నామని, అయితే ప్రజల్లో ఇంకా టీడీపీపై కోపం ఉందన్నవిషయాన్ని అసెంబ్లీ ఫలితాలు వెల్లడించాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్‌ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, కనీసం మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయకుండా ఫామ్‌హౌజ్‌లో యాగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

‘ప్రజలు గెలిపించింది పాలించడానికా.. యాగాలు చేయడానికా?’అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికలు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతాయని, మోదీ, రాహుల్‌ల మధ్య జరిగే యుద్ధంలో న్యాయం గెలిచి.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ నెలలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని విజయశాంతి వెల్లడించారు. కోచైర్మన్‌ డీకేఅరుణ మాట్లాడుతూ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అనుకున్నామని, అయితే, టీఆర్‌ఎస్‌ ధనబలంతో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

అధికారంలో ఉన్నామనే అహంకారంతో 16 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకుంటున్నారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి మళ్లీ కాంగ్రెస్‌కు పట్టంగట్టాలని ఓటర్లకు అరుణ విజ్ఞప్తి చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలిచినా ఫలితం లేదని.. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనీ కేసీఆర్‌ సాధించలేదని ఆమె విమర్శించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఈవీఎంల వినియోగంపై అనుమానాలున్నప్పుడు.. బ్యాలెట్‌ వినియోగించడమే మేలని ఆమె అభిప్రాయపడ్డారు. లోక్‌సభకు తాను పోటీచేయాలా వద్దా అన్నది అధిష్టానం నిర్ణయమని అరుణ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు